పోలీసులను చూసి గొంతు కొసుకున్న స్వాతి హంతకుడు
posted on Jul 2, 2016 @ 10:48AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్వాతిని హత్య చేసిన నిందుతుడిని రామ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడు తమిళనాడులోని తిరునల్వేలీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి అతన్ని అరెస్ట్ చేసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులను చూడగానే రామ్‌కుమార్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రామ్‌కుమార్ తిరునల్వేలీలోని సెంగట్టాయ్ ప్రాంతానికి చెందినవాడు. అతను ఉద్యోగం కోసం చెన్నై వచ్చాడని, స్వాతి ఉంటున్న హాస్టల్ ప్రాంతంలోనే ఉన్నాడని చెబుతున్నారు. తనను ప్రేమించాలని కొద్ది నెలలుగా స్వాతి వెంటపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె అతన్ని నిరాకరించడంతో పగపెంచుకున్నాడు. ఈ నెల 24న చెన్నై నుంగంబాక్యం రైల్వేస్టేషన్‌లో ఆఫీసుకు వెళ్లేందుకు ట్రైన్ కోసం నిరీక్షిస్తుండగా స్వాతితో గొడవపడ్డాడు. అనంతరం తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి చంపినట్లు తెలుస్తోంది. రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాలలో రికార్డైన ఫుటేజీ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు నిందుతుడి జాడను కనుగొన్నారు.