స్వాతి నన్ను కొండముచ్చు అంది..అందుకే చంపా
posted on Jul 4, 2016 @ 10:29AM
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చెన్నైకు తరలించారు. పాళయం కోట్టై ఆసుపత్రిలో దేవరాజన్ నేతృత్వంలోని విచారణ బృందానికి రామ్‌కుమార్ వాంగ్మూలం ఇచ్చాడు. ఫేస్‌బుక్ ద్వారా స్వాతితో పరిచయం ఏర్పడిందని..ఆమె కోసమే చెన్నై వచ్చినట్టుగా పేర్కొన్నాడు.
తాను ప్రేమించమని ఒత్తిడి తెచ్చినప్పుడల్లా స్వాతి చీదరించుకునేదని..అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడంతో తన మీద ఆమెకు ప్రేమ ఉందని భావించానన్నాడు. అందుకే పదేపదే ఆమె వెంట పడ్డానని చెప్పాడు. చివరకు తన ప్రేమను తిరస్కరించడంతో పాటు కొండముచ్చవలే ఉన్నావని పదేపదే అనడంతో బాధపడ్డానని దీంతో తనలోని ఉన్మాది బయటకు వచ్చాడని, మీనాక్షిపురానికి వచ్చి ఓ తోటలో అరటి గెలలు కోయడానికి ఉంచిన కత్తిని రహస్యంగా తీసుకుని వెళ్లినట్టు చెప్పాడు. ఆమెను బెదిరించాలని మాత్రమే అనుకున్నానని..కాని స్వాతి మాటలు తనను ఉన్మాదిని చేసినట్టు, హంతకుడిగా మార్చేసినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తదుపరి విచారణ నిమిత్తం రామ్‌కుమార్‌ను పాళయం కోట్టై ఆసుపత్రి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో చెన్నైకి తరలించారు.