కవిత "ఆంధ్ర"కు జై కొట్టింది...
posted on Jul 4, 2016 @ 10:49AM
రాజకీయ చాణక్యంలోనూ..వాగ్ధాటిలోనూ తండ్రి నుంచి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత. తెలంగాణ ఉద్యమంలో "ఆంధ్ర" అన్న పదం వినబడితే చాలు చిర్రెత్తిపోయేవారు కవిత. తమను దోచుకున్నారని..నాశనం చేశారని ఆంధ్రా ప్రాంతం వారిపై విరుచుకుపడేవారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఆమె "ఆంధ్రా" అంటే కయ్యానికి కాలుదువ్వుతూనే ఉన్నారు.
అలాంటి కవిత "ఆంధ్రకు జై" కొట్టారు. అవును ఇది పచ్చి నిజం. అమెరికాలోని తెలుగు అసోసియేషన్ "తానా" సభలకు కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె తెలుగువారు ఎక్కడున్నా ఒక్కటేనని..రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి ప్రసంగం చివర్లో "జై తెలంగాణ", "జై ఆంధ్రా" అని పలికారు. ఇది అక్కడున్న వారికి ఆనందాన్ని..ఆశ్చర్యాన్ని ఒకేసారి కలిగించింది. రాజకీయ నేతలు అవసరానికి తగ్గట్టుగా మాట్లాడతారని విన్నాం..ఇప్పుడు కవిత ఇలాగే మాట్లాడారా..? లేక నిజంగానే తెలుగువారందరి పక్షానా మాట్లాడారా..?