సౌకర్యాలపై ఉద్యోగులను ఆరా తీసిన చంద్రబాబు..
posted on Jul 4, 2016 @ 11:46AM
తన విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగుల పట్ల చంద్రబాబు మరోసారి తన కృతజ్ఞత చాటుకున్నారు. చైనా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన ఇవాళ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించారు. ఐదవ బ్లాకులో ఏర్పాటైన శాఖల కార్యాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు.
తాత్కాలిక సచివాలయంలో వసతులు ఎలా ఉన్నాయి..? మీకు బస ఎక్కడ ఏర్పాటు చేశారు..? భోజనం రుచికరంగా ఉంటోందా..? ఏవైనా సమస్యలు ఉంటే చెప్పండి..? ఎవరూ ఇబ్బందులు పడకుండా చూసుకుంటామన్నారు. ఇక్కడికి రావడానికి రహదారులు సరిగ్గా లేవని కొందరు ఫిర్యాదు చేశారు..దీనిపై స్పందించిన సీఎం త్వరలోనే ఆ సమస్య తీరిపోతుందని హామీ ఇచ్చారు. మిగిలివున్న పనులను యుద్థప్రాతిపదికన పూర్తి చేయాలని, మిగతా భవనాలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్ తదితరులున్నారు.