మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి రమ్య
posted on Jul 10, 2016 @ 11:23AM
తొమ్మిది రోజుల క్రితం హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి రమ్య ఇక లేదు. తొమ్మిది రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. చిన్నారి మరణించినట్టు కేర్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇదే ప్రమాదంలో గాయపడి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తల్లి రాధికను చివరి చూపు కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో కేర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పాపను విగతజీవిగా చూడగానే తల్లిహృదయం విలవిల్లాడిపోయింది. రమ్య ఇక లేదని తెలిసి రాధికతో పాటు కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
మూడో తరగతి చదువుతున్న రమ్యను జులై 1న ఇంటికి తీసుకువస్తుండగా..పంజాగుట్ట శ్మశానవాటిక సమీపంలో ఎదురుగా వేరే లేన్‌లో వస్తున్న కారు ఎగిరి వీరి కారుపై పడటంతో ఒకరు చనిపోగా..మిగిలిన వారు మంచానికే పరిమితమయ్యారు. ఇక ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి రమ్యను కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే పాప బ్రెయిన్‌డెడ్ అయినట్టుగా అప్పటికే వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతున్న రమ్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు తాగి కారు నడిపి ఇంతటి దారుణానికి కారణమయ్యారు.