మహాత్మునికి అవమానం జరిగిన ప్రాంతంలో మోడీ
posted on Jul 10, 2016 @ 11:44AM
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ జాతిపిత మహాత్మాగాంధీని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చారిత్రక రైలు ప్రయాణం చేశారు. దక్షిణాఫ్రికాలో నాడు మహాత్మాగాంధీ ప్రయాణం చేసిన మార్గంలో ప్రయాణించారు. జాతిపితను రైల్లో నుంచి తోసేసిన పీటర్‌మారిజ్‌బర్గ్ రైల్వేస్టేషన్‌ను మోడీ సందర్శించారు.
1893 జూన్ 7వ తేదీన ఈ మార్గంలో ప్రిటోరియా నుంచి డర్బన్ వెళ్తున్న గాంధీ వద్ద తగిన టికెట్ ఉన్నా ప్రధమశ్రేణి పెట్టెలో ప్రయాణించడం కుదరదంటూ శ్వేతజాతీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే మూడో శ్రేణి పెట్టెలోకి వెళ్లాల్సిందిగా తెల్లదొర ఆదేశించినా గాంధీ వెళ్లకపోవడంతో పీటర్‌మారిజ్‌బర్గ్ స్టేషన్‌లో ఆయన్ను బయటకు గెంటివేశారు. ఎముకలు కొరికేసే చలిలోనే ఆ రాత్రంగా స్టేషన్లో గడిపిన మహాత్ముడు... తాను దక్షిణాఫ్రికాలోనే ఉండాలనీ, భారతీయులపై జాత్యాహంకార దాడులపై పోరాడాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటానికీ శ్రీకారం చుట్టారు. గాంధీని ఏ ప్రదేశంలో రైల్లోనుంచి బలవంతంగా కిందికి దించేశారో ఆ ప్రదేశాన్ని మోడీ సందర్శించి జాతిపితకు నివాళలుర్పించారు.