కేసీఆర్ తిన్న హైకోర్టు మొట్టికాయలు ఇవే..
posted on Aug 4, 2016 @ 5:19PM
కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టుతో మొట్టికాయలు పెట్టించుకోవడం కొత్తేమి కాదు. ఎన్నో అంశాల్లో.. ఎన్నోసార్లు కోర్టు చేత మొట్టికాయలు పెట్టించుకుంది. రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది. ఈ రెండు సంవత్సరాల్లో ఏ రాష్ట్రం నమోదు చేయని ఒక రికార్డును తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసింది. ఆవేశంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం.. దీని నుండి తీవ్ర వ్యతిరేకత ఏర్పడటం.. ఆఖరికి వ్యవహారం కాస్త కోర్టుకు వెళ్లడం..అక్కడ చివాట్లు తినడం ఇదే సరిపోయింది.
* రాష్ట్ర విభజన జరిగి అధికారంలోకి వచ్చిన తరువాత మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో.. తెలంగాణలో వాహనాలన్నీ మళ్లీ తెలంగాణ రాష్ర్టం కోడ్ తో మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేసీఆర్ సర్కారు ఆదేశించింది. దీనిపై కోర్టు ఆభ్యంతరం వ్యక్తం చేసింది.
* ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారం.. ఏపీ ఉన్నత విద్యామండలితో తమకు సంబంధం లేదని.. తాము ఇప్పుడప్పుడే అడ్మిషన్లు నిర్వహించబోమని టీ సర్కారు భీష్మించుకు కూర్చుంది. అసలు ఏపీ విద్యామండలికి తెలంగాణలో కౌన్సెలింగ్ నిర్వహించే అధికారం ఏముందని ప్రశ్నించింది.
* మహాజన సర్వే విషయంలో కూడా కోర్టు ప్రభుత్వం తీరుపై మండిపడింది. అసలు బలవంతంగా సర్వే చేయాల్సిన అవసరమేమొచ్చిందని కోర్టు సర్కారును ప్రశ్నించింది. దీంతో దిగొచ్చిన సర్కార్.. సర్వే స్వచ్ఛందమేకానీ నిర్బంధం కాదని..ఇచ్చిన వివరాలు నమోదు చేసుకుంటామేకానీ బలవంతం చేయబోమని చెప్పింది.
* తాత్కాలిక పన్ను విధింపు విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తొందరపడింది. పక్క రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలు ట్యాక్స్ చెల్లించాలంటూ నానా హడావుడి చేసింది. అయితే ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుని... మరో ఏడు నెలలు సమయం ఉందని చెప్పడంతో అప్పుడు వివాదం సద్దుమణిగింది.
* ఇంకా తెలంగాణ ప్రభుత్వం చేసిన వీసీ నియామకాలపై కూడా హైకోర్టు స్పందించి.. రెండు రోజులు ఆగలేకపోయారా.. వీసీలను నియమించినంత మాత్రాన అయిపోయిందా అంటూ ప్రశ్నించింది.
* ఫాస్ట్ పథకం గురించి మరో వ్యాజ్యంలో కోర్టు చాలా సీరియస్ అయ్యింది. తెలంగాణలో భారత్ లో అంతర్భాగమే కదా… మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. చట్టానికి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి. ఫాస్ట్ పై ప్రభుత్వం విడుదల చేసిన జీవో జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా ఉంది. ఆరు వారాల పాటు విచారణను వాయిదా వేసిన కోర్టు ఫాస్ట్ పై వెంటనే పునరాలోచన చేసుకుని రావాలని ఆదేశించింది.
* స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లోఉన్న అకౌంట్లకు సంబంధించి కోర్టుకు వెళితే అక్కడా చుక్కెదురైంది.
* గ్రేటర్ ఎన్నికలు.. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ పట్టు లేక.. ఎలక్షన్స్ ను వాయిదా వేస్తూ వస్తున్న ప్రభుత్వానికి కోర్టు అక్షింతలు వేసింది. డిసెంబర్‌లోగా ఎన్నికలు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించింది. మీ వల్ల కాలేకపోతే మేం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని గట్టిగా మందలించింది.
* పార్లమెంటరీ సెక్రటరీ హోదా అనే కొత్త పదవిని తెరపైకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ పదవులు ప్రజాధనం వృథా చేయడమే అవుతుందని దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని కోర్టు తేల్చిచెప్పింది.
* కొత్త సచివాలయ నిర్మాణం కూడా కోర్టు కేసుల్లో చిక్కుకుంది. చెస్ట్ ఆసుపత్రి భవంతి హెరిటేజ్ జాబితాలో ఉందా లేదా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.
* హైకోర్టు విభజన.. హైకోర్టు విభజన అంశంలోనూ తెలంగాణ ప్రభుత్వం స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఒకే ప్రాంతంలో రెండు రాష్ట్రాలకు హైకోర్టులు ఉండటం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది. అసలు హైకోర్టు ఏర్పాటు విషయంలో తెలంగాణకు సంబంధం లేదని చెప్పింది.
* ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వియంలో కూడా ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెంబర్: 123,124 లని రద్దు చేసింది. భూసేకరణ వ్యవహారంలో 2013 చట్టాన్నే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా వస్తూనే ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం.. కోర్టు చేత తిట్లు తినడం. ఇంకా ముందు ముందు ఎన్ని చివాట్లు తింటారో చూద్దాం..