మోడీపై బీజేపీ నేతల డౌట్..!
posted on Aug 4, 2016 @ 6:08PM
తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు ఓ విషయంలో తెగ బాధపడిపోతున్నారంట. ఇంతకీ ఏంటా విషయం.. బీజేపీ నేతలని అంతలా బాధ పెడుతున్నదేమిటీ.. అని అనుకుంటున్నారా..? ఎవరి విషయంలోనో కాదు ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో బీజేపీ నేతలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు.
అసలు సంగతేంటంటే.. ఈనెల 7న తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి రానున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రానికి వచ్చిన ఆయన అటు కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమావేశాల్లో పాల్గొననున్నారు. అయితే ఇక్కడే బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన కేంద్ర మంత్రలు ప్రభుత్వ తీరును ప్రశంసించి వెళుతున్నారు. శభాస్ అని మెచ్చుకొని మరీ వెళుతున్నారు. ఇదే టీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్ అయింది. అంతేకాదు వారి సమావేశాల్లో కూడా ప్రశంసల్ని తమకు అనుకూలంగా మార్చుకొని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేరుగా ప్రధానమంత్రే రాష్ట్రసర్కార్‌పై ప్రశంసలు కురిపిస్తే, తమ పరిస్థితి ఏంటని జుట్టుపీక్కుంటున్నారు. ఎక్కడ రాష్ట్రంలో పాలనను ఆకాశానికెత్తేస్తారో అని బాధపడుతున్నారు.
అసలే తెలంగాణ బీజేపీ నేతలు ప్రతిపక్ష పార్టీగా తాము మాత్రమే వ్యవహరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కొన్ని కార్యక్రమాలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రజెంట్ అయితే మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంపై తెలంగాణ సర్కార్ పై మాటాల తూటాలు పేల్చుతూ.. రైతులకు సంఘీభావంగా బీజేపీ నేతలు వేదికలు పంచుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మోడీ ఎలాంటి ప్రసంగం చేస్తారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రానికి ప్రధానమంత్రి రావాలని తొలుత ఆహ్వానించింది రాష్ట్ర బీజేపీ నేతలే. ఆ తర్వాతే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీని రమ్మని ఆహ్వానించారు. పార్టీ పరంగానే ప్రధాని రాష్ట్రానికి వచ్చి ఉంటే బాగుండేదని, ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకోవడం సరికాదని కొందరు బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి మోడీ ఏం చేస్తారో.. పార్టీని చిక్కుల్లో పడేస్తారా..? లేక కాపాడుతారా..? చూడాలి.