భారత బాలిక కిడ్నాప్.. కథ సుఖాంతం
posted on Aug 4, 2016 @ 12:54PM
బహ్రెయిన్ లో ఐదేళ్ల సారా అనే భారత బాలిక కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. వివరాల ప్రకారం.. సారాను కారులో ఉంచి తన తల్లి మంచినీళ్లు బాటిల్ తేవడానికి ఓ షాపుకు వెళ్లగా అక్కడ ఇద్దరు వ్యక్తులు కారుతో సహా కిడ్నాప్ చేశారు. దీంతో సారా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు 25 పహారా వాహనాలను పంపి ముమ్మరం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు జనరల్ డైరెక్టర్ కలోనియల్ ఖలీద్ ఆల్ థవాది మాట్లాడుతూ.. హూరా ప్రాంతంలో నిందితురాలి ఇంట్లో పాపను గుర్తించామని చెప్పారు. సారాకు ఎటువంటి ముప్పు తలపెట్టలేదని, ఆమె ఆరోగ్యంగా ఉందని ఆమె మేనమామ అనిశ్ చార్లెస్ తెలిపాడు. హూరా పోలీస్ స్టేషన్ లో బుధవారం రాత్రి పాపను తమకు అప్పగించారని చెప్పారు.
కాగా ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఈ కిడ్నాప్ లో పాప తండ్రి హస్తం ఉందని.. మేనమామ అనిశ్ ఛార్లెస్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పాప తండ్రి భారత్ లో ఉంటున్నాడని, మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారని, అయితే ఆయన కుట్రచేసే అవకాశం ఉందని అనిశ్ ఆరోపించాడు.