ఏపీ ప్రత్యేక హోదా పై ఓటింగ్.. మళ్లీ అదే తంతు..
posted on Aug 4, 2016 @ 11:57AM
ఏపీ ప్రత్యేక హోదాపై రేపు పార్లమెంట్లో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరే అసలు రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా అన్న సందేహాలు మరింత అందరిలో రేగుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లో తెలుగు ఎంపీలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై ఎన్నో అడ్డంకుల నేపథ్యంలో ఏదో నామ్ కే వాస్త్ చర్చ జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రి జైట్లీ కూడా ప్రత్యేక హోదా రాదు అని పరోక్షంగా వెల్లడించారు. దీంతో ఏపీ రాష్ట్రమంతటా నిరసలు, ధర్నాలు మొదలు పెట్టారు. ఇక ప్రతిపక్ష, విపక్ష పార్టీలు కూడా కలిసి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మిత్రపక్షమైనప్పటికీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ అధిష్టానం కాస్త కొంచెం దిగొచ్చినట్టు కనిపించింది. ఇక వెంకయ్య నాయుడు కూడా మోడీని హెచ్చరించినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై మరోసారి చర్చను రేపు జరిపిస్తామని చెప్పారు.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. సాధారణంగా.. ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రతి రెండో శుక్రవారం నాడు సభలో ప్రవేశపెడతారన్న సంగతి తెలిసిందే. అయితే రేపు ఉత్తరాదిన 'తీజ్' పండగ. వ్యాపారులు తమ వ్యాపార వృద్ధి కోసం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మన దక్షిణాదిన తొలి శ్రావణ శుక్రవారం కూడా. పండుగ రోజు కాబట్టి కొంతమంది ఎంపీలు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే మళ్లీ రెండో శుక్రవారం వచ్చే లోపు పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోవచ్చు. దీంతో మళ్లీ వచ్చే శీతాకాల సమావేశాల వరకూ బిల్లు పెండింగ్ లో ఉన్నట్టే. అంటే రేపు సభ జరుగుతుందో లేదో అన్న విషయం స్పీకర్ కురియన్ పై ఆధారపడి ఉంది. ఒకవేళ స్పీకర్ కనుక సెలవు ప్రకటిస్తే మరోసారి ఏపీ ప్రజల చెవిలో కేంద్రం పువ్వు పెట్టినట్టే.. హోదా బిల్లుపై చర్చ, ఓటింగ్ జరుగుతుందని ఆశిస్తున్న ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్టే. ఏం జరుగుతుందో మరి చూడాలి.