సింధూకి ఘన సన్మానం.. తనవల్లే ఇక్కడ ఉన్నా..
posted on Aug 22, 2016 @ 2:55PM
రియో స్టార్ పీవీ సింధూకి గచ్చిబౌలి స్టేడియంలో ఘన సన్మానం చేశారు. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి దేశానికి పేరు ప్రతిష్టతలు తెచ్చిపెట్టిన సింధూ హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర మంత్రులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడినుండి గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియానికి చేరుకున్న ఆమెకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, మహేందర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఆమెతో పాటు ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ ని కూడా సన్మానించారు. వారిరువురికీ జ్ఞాపికలను అందించారు.
ఈ సందర్భంగా సింధూ మాట్లాడుతూ.. తన కోచ్ పుల్లెల గోపిచంద్ వల్లే ఈరోజు తానిక్కడ ఉన్నానని.. తనను తన తల్లిదండ్రులు కూడా ఎంతగానో ప్రోత్సహించారని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి సింధు ధన్యవాదాలు తెలుపుతూ.. క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ధన్యవాదాలు అని ఆమె అన్నారు. ఈరోజు స్టేడియంకి ఇంతమంది వస్తారని తాను అనుకోలేదని.. బ్యాడ్మింటన్‌లో రాణించి, మరింత ముందుకు వెళతానని చెప్పారు.