టాలీవుడ్ తో నయీంకు లింకులు.. పలువురు బడా నిర్మాతలు
posted on Aug 22, 2016 @ 3:22PM
నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం రోజుకో ఆసక్తికరమైన అంశం బయటపడతూనే ఉంది. ఇప్పటికే నయీం సహరించిన వారిలో పోలీస్ అధికారులు, పలువురు రాజకీయ నేతలు, ఇంకా అనేక మంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ నేత పేరు బయటపడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో మరో బాంబు పేలింది. అదేంటంటే.. నయీంకు టాలీవుడ్ తో లింకులు ఉన్నట్టు. దీనిపై ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలకు నయీమ్ తో సంబంధాలున్నాయని ఆరోపించారు. సి.కల్యాణ్, అశోక్ కుమార్, బండ్ల గణేశ్, సచిన్ జోషిలకు నయీమ్ తో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. విజయవాడ నుండి విశాఖ వరకూ థియేటర్లలో క్యాంటీన్ వ్యాపారం నయీం మనుషులదేనని.. తన థియేటర్ ను కూడా నయీమ్ అనుచరులు లాగేసుకున్నారని.. నయీంను అడ్డంపెట్టుకొని భూదందాలు, సెటిల్మెంట్లు చేసేవారని.. నయీంతో టాలీవుడ్ లింకులపై విచారణ జరిపించాలని కోరారు. అంతేకాదు నయీం మనుషులు నన్ను కిడ్నాప్ చేయాలని చూశారు.. కానీ ఓ ఎమ్మెల్యే సహకారంతో బయటపడ్డాను అని తెలిపారు. మరి దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.