సిద్దరామయ్య నిమ్మకాయ సీక్రెట్ ఏంటబ్బా..
posted on Aug 31, 2016 @ 5:45PM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చుట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా నిమ్మకాయ వివాదంలో పడ్డారు. ఇప్పుడు కర్ణాటకలో ఆయన పట్టుకున్న నిమ్మకాయనే హాట్ టాపిక్ అయింది. ఇంతకీ సిద్ద రామయ్య ఏంటీ.. ఆయన పట్టుకున్న నిమ్మకాయ గోల ఏంటి అనుకుంటున్నారా..అసలు సంగతేంటంటే.. సిద్దరామయ్య తన స్వస్థలం అయిన మైసూర్‌లో పర్యటించారు. అయితే ఆయన పర్యటనలో రోజు మొత్తం తన చేతిలో నిమ్మకాయ పట్టుకునే తిరిగారు. ఇది కాస్త మీడియా కంటపడటంతో దీనిపై వార్తలు జోరందుకున్నాయి. అసలు సిద్దరామయ్య నిమ్మకాయ ఎందుకు పట్టుకున్నారు అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్లు చేస్తున్నారు. దుష్టశక్తులను ఎదుర్కోవడానికి ఏ మతపెద్దలో సిద్ధరామయ్యకు నిమ్మకాయ ఇచ్చివుంటారని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది మాత్రం..ఇటీవల సిద్ధరామయ్య కుమారుడు రాకేశ్ అకస్మాత్తుగా మృతిచెందడంతో సీఎంలో చాలా మార్పు వచ్చిందని.. ఏదో దుష్టశక్తి తన కుటుంబానికి హాని చేస్తోందని సీఎం అనుకుంటున్నారని, మిగతా కుటుంబసభ్యుల భద్రత గురించి బెంగ పడుతున్నారని, కొందరు జ్యోతిష్కులు ప్రత్యేక పూజలు చేయాలని సీఎంకు సూచించారని అంటున్నారు. మరి ఇంతకి సిద్దరామయ్య నిమ్మకాయ ఎందుకు పట్టుకున్నారో ఆయనకే తెలియాలి.