ఇదే ఫైనల్.. ఇంకేప్పుడూ ఇలా చేయోద్దు.. మోడీకి ప్రణబ్
posted on Aug 31, 2016 @ 3:26PM
మోడీ ప్రభుత్వానికి అప్పుడప్పుడు మొట్టికాయలు పడుతూనే ఉంటాయి. అయితే అది కోర్టులో చేతిలో కావచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ చేతిలో కూడా మొట్టికాయలు తినే పరిస్థితి వచ్చింది. ఓ ఆర్డినెన్స్ విషయంలో ప్రణబ్ ముఖర్జీ మోడీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇంతకీ చాలా సౌమ్యంగా ఉండే ప్రణబ్ కు అంతలా కోపం తెచ్చే పని మోడీ సర్కార్ ఏం చేసిందబ్బా అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. ఇండియాలో నివాసం ఉండి చైనా, పాకిస్థాన్ కు వలస వెళ్లిన వారి ఆస్తులను వేరొకరికి బదలాయించేందుకు మోదీ సర్కారు ఇటీవలే పార్లమెంటులో చట్టసవరణ కోసం ప్రయత్నించింది. అయితే ఈ చట్టసవరణకు లోక్ సభలో ఆమోదం పొందినా...రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం లేకపోవంతో బిల్లు రాజ్యసభలో వీగిపోయింది. దీంతో మోడీ సర్కార్.. దీనిని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని యోచించి అందుకోసం రాష్ట్రపతి అనుమతి కోసం పంపించింది. అయితే దీనిని పరిశీలించిన ప్రణబ్... పార్లమెంటు ఆమోదం పొందని ఓ ఆర్డినెన్స్ ను ఎలా తన వద్దకు పంపిస్తారని.. పక్కదారిన ఆర్డినెన్స్ తీసుకురావడం సరైన చర్య కాదని, కాకపోతే ప్రజాప్రయోజనాల దృష్ట్యా సంతకం చేస్తున్నానని నోట్ లో పేర్కొంటూ ఆమోదం తెలిపారు. అంతేకాదు ఇంకోసారి ఇలా చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి నోట్ రాసి పంపినట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా ప్రణబ్ చెప్పినట్టు మోడీ సర్కార్ ఇలాంటి పనులు చేయకుండా ఉంటుదేమో చూడాలి.