తమిళనాడుపై స్వామి కన్ను... రాష్ట్రపతి పాలనకు డిమాండ్..
posted on Oct 7, 2016 @ 1:16PM
ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు తమిళనాడు పై పడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత 17 రోజుల నుండి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలని స్వామి డిమాండ్ చేశారు. దీనిలో భాగంగానే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్వామి లేఖ రాశారు. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనలో శూన్యత ఏర్పడిందని.. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశం ఉందని.. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగు పడేవరకు ఆరు నెలల పాటు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) అమలు చేయాలని డిమాండ్ చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.