కొత్తపార్టీ లేదు... సీఎం పదవికి రాజీనామా చేస్తా..
posted on Oct 24, 2016 @ 11:33AM
యూపీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది ములాయం కుటుంబంలో రాజకీయ విబేధాలు కూడా ఎక్కువగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. రోజుకో కొత్త అంశం బయటపడుతుంది. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఈ పార్టీతోనే వచ్చే ఏడాది జరగబోయే యూపీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారన్న కథనాలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలపై స్పందించిన అఖిలేష్ యాదవ్ తాను ఎట్టి పరిస్థితిలోనూ కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈరోజు ఎస్పీ కార్యాలయంలో జరగనున్న సమావేశానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలు మాత్రమే అని తెలిపారు. అంతేకాదు పార్టీ చీఫ్ ములాయం సింగ్ కోరుకుంటే సీఎం పదవికి కూడా రాజీనామా చేస్తానని కూడా తెలిపారు. అమర్ సింగ్ వ్యాఖ్యలు తనను బాధ పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పార్టీ పెట్టబోనని తేల్చిచెప్పారు.