ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్... 18 మంది మావోయిస్టులు మృతి
posted on Oct 24, 2016 @ 10:30AM
ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ఏవోబీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒడిశా సరిహద్దులోని అటవీప్రాంతం చిత్రకొండ, జెంత్రీ మధ్యలో బూసుపట్టి ఏరియాకు 10 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టుల ప్లీనరీ సమావేశం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. గ్రేహౌండ్స్ దళాలు, పోలీసులు కలిసి సంయుక్తంగా ఏవోబీని జల్లెడపట్టగా.. సోమవారం ఉదయం మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టులను చుట్టుముట్టి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో నాలుగు ఏకే 47 తుపాకులు, రైఫిల్స్‌తో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది మావోయిస్టులు తప్పించుకుపోయినట్లు తెలుస్తోంది. తప్పించుకుపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలవ్వగా.. వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ల ద్వారా ఒడిశాలోని ఆస్పత్రులకు తరలించారు.
కాగా మృతుల్లో పలువురు మావో అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా మృతి చెందిన వారిలో గాజర్ల రవి, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్, మున్నాలను గుర్తించారు. మావోయిస్టు అగ్రనేత కొడుకే మున్నా అని సమాచారం.