ములాయం, అఖిలేష్ మధ్య వాగ్వాదం...
posted on Oct 24, 2016 @ 1:12PM
ములాయం సింగ్ నేతృత్వంలో లక్నోలోని పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొడుకు అఖిలేష్ యాదవ్ కు, తన సోదురుడు శివపాల్ యాదవ్ కు మధ్య విబేధాలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో ములాయం సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు సమావేశంలో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో నిజంగానే ములాయం చేసిన వ్యాఖ్యలు అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎందుకంటే.. ఎప్పుడూ ప్రధాని మోడీపై విరుచుకుపడే ఆయన.. ఈసమావేశంలో మాత్రం ఆయనపై ప్రశంసలు కురిపించారు. "మన ప్రధాని మోదీని చూడండి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన అకుంఠిత శ్రమతో ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆయన అంకిత భావం చాలా గొప్పది. తన తల్లిని ఎన్నటికీ వీడనని ఎల్లవేలలా ఆయన చెబుతూనే ఉంటారు. మోదీకి తన తల్లి ఎలాగో, తనకు శివపాల్ యాదవ్, అమర్ సింగ్ అంతే. వారిద్దరిని కూడా నేను ఎన్నటికీ వదలను", అని అన్నారు. తన కోసం, పార్టీ కోసం తన తమ్ముడు శివపాల్ చేసిన కృషిని తాను ఎన్నడూ మరవనని.. అమర్ సింగ్ తను సొంత తమ్ముడిలాంటి వాడని, కష్ట సమయాల్లో ఎన్నోసార్లు తన వెన్నంటే నిలిచాడని అన్నారు. అమర్ చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోయాయని... ఆయనను తప్పుబట్టడానికి ఏమీ లేదని అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకోకుంటే అఖిలేష్‌ను పార్టీ నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడమని తేల్చిచెప్పారు. విమర్శలు ఎదుర్కొనే సత్తా లేని వారు నాయకుడిగా ఎదగలేరు అని అఖిలేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా ములాయం చేసిన వ్యాఖ్యలకు కొడుకు అఖిలేష్ యాదవ్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తనపై ఆరోపణలు చేసిన అమర్ సింగ్ ను ములాయం వెనకేసుకురావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తినట్టు కనిపిస్తోంది. పార్టీ పెడుతున్నట్లు తాను ఎప్పుడూ చెప్పలేదని.. సీఎం పదవికి రాజీనామా చేయమంటే చేస్తానని కంటతడిపెట్టారు. తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాడమని చెప్పింది మీరే కదా అని ములాయంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమర్‌సింగ్ వల్లే పార్టీలో విబేధాలు వచ్చాయని తెలిపారు. మరి ముందు ముందు ఇంకెన్ని ట్విస్టులు చోటుచేసుకుంటాయో చూడాలి.