వేలిముద్ర వేసిన జయలలిత..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గతకొద్దికాలంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల్లో తమిళనాడులో ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జ‌య‌ల‌లిత ఎన్నిక‌ల ద‌ర‌ఖాస్తుపై వేలి ముద్ర పెట్టారు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పలు ఆరోపణల నేపథ్యంలో ఎన్నికలు రద్దు చేశారు. ఇప్పుడు ఆ నియోజక వర్గాల్లో ఎన్నికలకు గాను ద‌ర‌ఖాస్తుపై వేలి ముద్ర పెట్టారు. జ‌య కుడి చేయికి ఇన్‌ఫెక్ష‌న్ కావ‌డం వ‌ల్ల ఆమె సంత‌కం చేయ‌లేక‌పోయిన‌ట్లు అధికారులు తెలిపారు. తిరుప‌రంగుడ్ర‌మ్ నియోజ‌క‌వ‌ర్గం కోసం ఉప ఎన్నిక‌ల‌కు జ‌ర‌గ‌నున్నాయి. దీనిలో భాగంగానే జ‌య త‌మ పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేందుకు వేలి ముద్ర పెట్టాల్సి వ‌చ్చింది. ఆ స్థానం నుంచి అన్నాడీఎంకే అభ్య‌ర్థిగా ఏకే బోస్ పోటీప‌డుతున్నారు. అయితే ఆ అభ్య‌ర్థి చేసే ఎన్నిక‌ల ద‌ర‌ఖాస్తుకు పార్టీ అధినేత సంత‌కం అవ‌స‌రం ఉటుంది. ఈ కార‌ణంగా సీఎం జ‌య ఆ అప్లికేష‌న్‌పై వేలి ముద్ర పెట్ట‌న‌ట్లు అధికారులు తెలిపారు. మ‌ద్రాస్ మెడిక‌ల్ కాలేజీ ప్రొఫెస‌ర్ ఆ సంత‌కాన్ని ప‌రిశీలించి ఆమోదం తెలిపారు. మరి జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని.. కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ కూడా అవుతుందని చెప్పి.. ఇప్పుడు వేలి ముద్ర వేయించడం ఏంటో అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

విమానంలో మంటలు...20 మందికి గాయాలు

  అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం.. చికాగో విమానాశ్రయంలో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బోయింగ్‌ 767 రన్‌వేపై టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చికాగో నుంచి మియామీ వెళ్తున్న ఈ విమానంలో 161 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉండగా వారిలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.ప్రయాణికులకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని, వారిని మియామికి మరో విమానంలో పంపిస్తామని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.

ఎయిర్ పోర్ట్ లో జేసీ చిందులు..

  టీడీపీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు చేదు అనుభవం ఏర్పడటంతో ఆగ్రహంతో ఊగిపోయిన జేసీ చిందులు తొక్కారు. ఎయిర్ ఇండియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళ్లేందుకు గాను జేసీ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అయితే అక్కడికి కొంచం లేటుగా రావడంతో అప్పటికే బోర్డింగ్ క్లోజ్ అయింది. ఈ విషయాన్ని సిబ్బంది చెప్పగా.. 'నా టికెట్టే రద్దు చేస్తారా?' అంటూ అధికారులపై మండిపడ్డారు. అంతేకాదు, తనదైన శైలిలో తిట్ల పురాణం అందుకున్నారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై కూడా చిందులు తొక్కారు.

పాక్ క్రూరత్వం.. భారత సైనికుడిని ముక్కలుగా నరికి...

  పాకిస్థాన్ ఇప్పటికే భారత్ సరిహద్దుల్లో పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో దారుణానికి ఒడిగట్టారు ఉగ్రవాదులు. బీఎస్ఎఫ్ కు చెందిన ఒక సైనికుడిని అత్యంత అమానుషంగా హతమార్చింది. కశ్మీర్‌ లో చొరబడ్డ ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతూ వెళ్లిన సైనికుడిని ఉగ్రవాదులు ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. కుప్వారా జిల్లాలోని మచ్చిల్ సెక్టార్ లో సైనికుడు తల, శరీర భాగాలను ఖండించారని బీఎస్ఎఫ్ తెలిపింది. అయితే ఇంతకు ఇంత తీర్చుకుంటామని వారు హెచ్చరించారు. ఈ దాడి సైనికుల సమక్షంలోనే జరిగి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు.

ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్..

  జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే భారత్ సైన్యం పాక్ రేంజర్లను హతమార్చుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులున్నారనే ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం అందగా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు జమ్మూలోని కుల్గాం జిల్లాలో ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాగా...  ఒకరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదిని అని తెలిపారు. వీరిలో ఒక పోలీసు కూడా ఉన్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కుప్వారా జిల్లా నుంచి వచ్చిన ఒక పోలీసు కూడా ఉన్నారని, వారి దగ్గర నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

జాన్సన్ అండ్ జాన్సన్కు భారీ జరిమానా..

  ఈ మధ్య ప్రముఖ కంపెనీలకు జరిమానాలు పడటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ జాబితాలో మరో కంపెనీ చేరింది. ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్కు భారీ జరిమానా పడింది. వివరాల ప్రకారం... ఈ సంస్థ పౌడర్ ను వాడటం వల్ల... కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళకు అండాశయ క్యాన్సర్కు గురైనట్టు తేలడంతో సెయింట్ లూయిస్ జడ్జి ఆ మహిళకు 70 మిలియన్ డాలర్లను అంటే రూ.467కోట్లకు పైగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గత నాలుగు దశాబ్దాలుగా బాధిత మహిళ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ను వాడుతోందని... మూడేళ్ల క్రితం ఆమె క్యాన్సర్ కు గురైందని కోర్టు తెలిపింది. కెమోథెరపీ, రేడియేషన్, సర్జరీ ఏది చేయించుకున్నా... రానున్న రెండేళ్లలో ఆమె మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లాయర్లు తెలిపారు. ఇప్పటికే ఈ కంపెనీకి వ్యతిరేకంగా 1,700 దావాలు ఫెడరల్ కోర్టుల్లో నమోదయ్యాయి. కంపెనీ ఆఫర్ చేసే చిన్న పిల్లల ఫౌండర్, షవర్-టు-షవర్ టాల్క్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్కు కారకాలుగా నిలుస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయానికి శంకుస్థాపన...

  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విజయవాడలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... అరుణ్‌ జైట్లీ, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో ప్రభుత్వ పరిపాలన భవనాల సముదాయానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాస భవనం, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల నివాస గృహాలు వంటివన్నీ ప్రభుత్వ భవనాల సముదాయంలో భాగంగానే నిర్మిస్తారు. ఈ నిర్మాణాలను 2018 డిసెంబర్‌ నాటికి కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 950 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయానికి రూ.5,600కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

టాటా ఛైర్మన్ లిస్ట్ లో పలువురు ప్రముఖులు..

  టాటా గ్రూపుల ఛైర్మన్ పదవి నుండి సైరస్‌ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో ప్రస్తుతం రతన్‌ టాటా తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. వచ్చే నాలుగు నెలల్లో ఛైర్మన్ ను నియమిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పటి నుండి నూతన ఛైర్మన్‌ ఎంపికకు కసరత్తు మొదలైనట్టు తెలుస్తోంది. అంతేకాదు అప్పుడే ఈ ఛైర్మన్ పదవికి కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అందులో టీసీఎస్‌ సీఈవో ఎన్‌.చంద్రశేఖరన్‌, జాగ్వార్‌ లాండ్‌రోవర్‌ అధినేత రాల్ఫ్‌స్పెత్‌ల పేర్లు  ఉన్నట్లు సమాచారం. అంతేకాదు వారితో పాటు ఛైర్మన్‌ పదవికి మిస్త్రీ బావ, ట్రెంట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ నోయెల్‌ టాటా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై టాటా కమిటీ చర్చలు జరిపి ఫిబ్రవరి నెలాఖరులోగా కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయనున్నారు. కాగా ఈ విషయమై చంద్రశేఖరన్‌, రాల్ఫ్‌ స్పెత్‌, టాటా అండ్‌ సన్స్‌ సంస్థ కానీ ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.

అలహాబాద్ హైకోర్టులో బాంబులు..

  ఈ మధ్య కోర్టుల్లో బాంబులు పెట్టడం పరిపాటైపోయింది. ఇప్పుడు తాజాగా అలహాబాద్ హైకోర్టులో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వివరాల ప్రకారం...  అలహాబాద్ హైకోర్టులో 55వ గదిలో ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న పేలుడు పదార్థాలను కోర్టు ఉద్యోగి గుర్తించాడు. దీంతో ఉద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... అక్కడికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు, బాంబ్ స్క్వాడ్ కలిసి ప్లాస్టిక్ బ్యాగును బయటకు తీసుకువచ్చి బాంబులను నిర్వీర్యం చేశారు. బ్యాగులో రెండు నాటు బాంబులు, పటాకులు, పదునైన ఆయుధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తప్పుదోవ పట్టించేందుకే బాంబులను పెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేంద్రంపై సుప్రీం ఫైర్... ఆ పరిస్థితి తీసుకురావద్దు...

  సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ‌మూర్తుల నియామ‌కంపై అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తున్న కేంద్రంపై జడ్జి థాకూర్ ఫైర‌య్యారు. మీతో పోరాడాల‌ని మాకు లేదు, కానీ మీరు ఇలాగే వెళ్తే, మేం అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. న్యాయవ్యవస్థలో నియామకాలపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం.. వ్యవస్థలు నిలిచిపోయే పరిస్థితిని తీసుకురావద్దని.. న్యాయమూర్తుల నియామకంలో ప్రతిష్టంభన సరికాదని కేంద్రాన్ని హెచ్చరించారు. వ్యవస్థలు నిలిచిపోయే పరిస్థితిని తీసుకురావద్దు.. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు సూచనలు, విజ్ఞప్తులు చేశాం.. నియామక ప్రక్రియకు విధివిధానాలు ఎందుకు ఖరారు చేయడం లేదు.. హైకోర్టుల్లో సగం ధర్మాసనాలు ఖాళీగా ఉన్నాయని మండిపడ్డారు.

15 మంది పాకిస్థాన్ రేంజర్లు మృతి...

  జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన 15 మంది సైనికులు మృతిచెందినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో తరచూ కాల్పులకు పాల్పడుతున్న పాక్ సైన్యానికి భారత సైన్యం ధీటుగా సమాధానం చెబుతుంది. భార‌త జ‌వాన్లు జ‌రిపిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన 15 మంది సైనికులు మృతిచెందారని.. బీఎస్ఎఫ్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ అరుణ్ కుమార్ తెలిపారు. భార‌త ద‌ళాలు జ‌రిపిన దాడుల్లో పాక్ రేంజ‌ర్లు ఎంత మంది చ‌నిపోయార‌న్న విష‌యాన్ని క‌చ్చితంగా చెప్ప‌లేక‌పోయినా, క‌నీసం 15 మంది పాక్ ఆర్మీ సైనికులు మృతిచెంది ఉంటార‌ని ఆయ‌న అన్నారు. మన సైనికులు ఎవరూ గాయపడలేదని బీఎస్ఎఫ్ పేర్కొంది. గత 24 గంటల నుంచి జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో ఫైరింగ్ కొనసాగుతూనే ఉంది. రాజౌరి, సాంబా, అబ్దులియా, ఆర్ ఎస్ పురా, సుచిత్గర్ ప్రాంతాల్లో ఏకథాటికి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

దేవునితో మాట్లాడా... ప్రమాణం చేశా..

  గతంలో అమెరికా అధ్యక్షుడైన బరాక్ ఒబామాపై సంచలన వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె అప్పటి నుండి అప్పుడప్పుడు వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసారి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. అది కూడా దేవుడితో మాట్లాడానని చెప్పి అందరికి షాకిచ్చారు. జపాన్ నుంచి తిరిగి స్వదేశానికి వస్తూండగా.. విమానంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో తాను మాత్రం ఆకాశం వైపు చూశానని.. ఆ సమయంలో తానొక గొంతును విన్నానని.. భవిష్యత్తులో నిరర్ధక వ్యాఖ్యలు మానుకోపోతే విమానాన్ని ఇప్పుడే కూల్చేస్తాననే మాటలు ఆకాశవాణి రూపంలో తనకు వినిపించినట్లు చెప్పారు. మీరెవరు? అని ప్రశ్నించగా దేవుడనే సమాధానం వచ్చిందని తెలిపారు. ఇక నుంచి తాను ఎవరినీ దూషిస్తూ మాట్లాడనని, శపించనని దేవుడికి ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. దేవుడికి ప్రమాణం చేస్తే ఫిలిప్పీన్ ప్రజలందరికీ ప్రమాణం చేసినట్లేనని అన్నారు.

మ‌సూద్ అజ‌ర్ ఓ ఉగ్ర‌వాది...

  పాకిస్థాన్ కు చైనా ఎప్పుడూ మద్దతు పలుకుతుందన్న విషయం అందరికి తెలిసిందే. జైషే మ‌మ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజ‌ర్ ఓ ఉగ్ర‌వాది అని అతనిపై నిషేదం విధించాలని భారత్ ఐరాస్ లో మొత్తుకున్నా చైనా దానికి అడ్డుకట్ట వేసింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన  పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫే నిజం చెప్పి అందరికి షాకిచ్చాడు. జైషే మ‌మ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజ‌ర్ ఓ ఉగ్ర‌వాది అని.. త‌మ దేశంలోనూ అత‌ను బాంబు పేలుళ్లు చేశాడ‌ని చెప్పారు.  అంతేకాదు మ‌రి అత‌న్ని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించ‌డాన్ని చైనా ఎందుకు అడ్డుకుంటోంద‌ని ప్ర‌శ్నించ‌గా..అత‌నితో చైనాకు ఏం సంబంధ‌మ‌ని ఎదురు ప్ర‌శ్నించారు. భార‌త్‌లో పాక్ హైక‌మిష‌న్ ఉద్యోగి గూఢ‌చ‌ర్యం చేస్తున్న కేసు గురించి ప్ర‌స్తావించ‌గా.. మొద‌ట ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని.. నిజంగా అలా జ‌రిగి ఉంటే.. అలాంటివాటిని ప్రోత్స‌హించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టంచేశారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వ తీరుపై స్పందించిన ఆయన న‌వాజ్ ష‌రీఫ్ ప్ర‌భుత్వంలో దూకుడు లేద‌ని అన్నారు. మరి మ‌సూద్ అజ‌ర్ ని ఉగ్రవాది అన్న ముషారఫ్ వ్యాఖ్యలకు పాక్ ఎలా స్పందిస్తుందో చూద్దాం..

జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్..

  భారత్ సరిహద్దుల్లో పాక్ సైన్యం తరచూ కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఉగ్రవాదులు తరచూ భారత్ లోకి చొరబడే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో జైషే-ఇ-మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసింది. 46 రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో భద్రతా సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి ఏకే-47, పిస్టల్, మందుగుండు సామాగ్రి, గ్రనేడ్ లాంచర్, యూబీజీఎల్ గ్రనేడ్స్‌ను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

వారిని మోసం చేస్తే జైలుకే..

  ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో  టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన అధికారులకు కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రైతులకు అమ్మే విత్తనాలపై ఆయన స్పందిస్తూ.. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు రైతులను మోసం చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. రాబోమే ఫిబ్రవరిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా రెయిన్‌ గన్స్‌ వినియోగించాలి, రక్షణతడులిచ్చి పంటలు కాపాడాలన్నారు. పశుగ్రాసం విత్తనాలు సరఫరా చేసి వేసవిలో కొరతలేకుండా చూడాలని, సబ్సిడీ ధరలకు పశుగ్రాసం సరఫరా చేసి పశుపోషకులకు అండగా ఉండాలని సూచించారు. వ్యవసాయం, అనుంబంధ రంగాల ప్రగతిపై జిల్లాలకు గ్రేడింగ్‌ ఇవ్వాలని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కరించాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

అఖిలేష్ కు వ్యతిరేకమే... కానీ..

  సమాజ్ వాదీ పార్టీలో కుటుంబ విబేధాలు ముగుస్తున్నట్టే కనిపిస్తున్నా.. రోజుకో ఉదంతం బయటకు వస్తునే ఉంది. అసలు ములాయం కుటుంబంలో కలహాలకు కారణమైంది అమర్ సింగ్ అని ఇప్పటికే ఆరోపణలు మోస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలపై స్పందించిన అమర్ సింగ్... కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అఖిలేష్ విధానాలు తనకు నచ్చక ఆయనకు వ్యతిరేకంగా ఉండవచ్చేమోగానీ, తన ఆప్తమిత్రుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడిగా అఖిలేష్ ఎప్పుడూ తనవాడేనని చెప్పుకొచ్చారు. తన త్యాగంతో, సమాజ్ వాదీ పార్టీలో గొడవలన్నీ సద్దుమణుగుతాయని చెబితే, తానందుకు సిద్ధమేనని అన్నారు. పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని అమర్ సింగ్ తెలిపారు. 

ఎన్నికలే అవసరం లేదు..గెలిచేది నేనే...

  గత రెండు రోజుల క్రితం ఎన్నికల్లో గెలుపు నాదే.. అది నాకు తెలుసు అని వ్యాఖ్యానించిన అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్ ఈసారి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈసారి ఏకంగా ఎన్నికలే అవసరం లేదని... తనను విజేతగా ప్రకటించడని అన్నారు. అంతేకాదు హిల్ల‌రీ విధానాలు దారుణంగా ఉన్నాయ‌ని.. ఆమె చాలా బ‌ల‌హీనురాల‌ని, దేశ అధ్య‌క్షురాలిగా చేసే స‌త్తా హిల్ల‌రీకి లేద‌ని మ‌రోసారి ట్రంప్ ఆరోపించారు. కాగా మ‌రో ప‌ది రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నిక‌లు జ‌రగ‌నున్న సంగతి తెలిసిందే. ఈ ప‌రిస్థితుల్లోనూ స‌ర్వేల్లో హిల్ల‌రీ కంటే ట్రంప్ వెనుక‌బ‌డే ఉన్నారు. ముఖ్యంగా రెండు పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరు ఉండే రాష్ట్రాల్లో హిల్ల‌రీ కాస్త ముందున్న‌ట్లు స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. మరి ఈ హోరా హోరీ పోటీల్లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

పగ తీర్చుకున్న పాక్...

  ఇండియాలో దౌత్యాధికారి హోదాలో పనిచేస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు ఇక్కడి సమాచారాన్ని రహస్యంగా పాక్ చేరవేస్తున్న మహ్మూద్ అఖ్తర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు సోదాల్లో భారత సైన్యానికి చెందిన కీలక పత్రాలు ఆయన దగ్గర్నుంచి పట్టుబడ్డాయి. దీంతో ఆయన్ని దేశం నుండి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. అయితే మన దేశం తీసుకున్న నిర్ణయంపై మండిపోయిన పాకిస్థాన్ వెంటనే ప్రతీకారం తీర్చేసుకుంది. పాకిస్థాన్ లోని భారత ఎంబసీలో పనిచేస్తున్న సుర్జీత్ సింగ్ పై వేటు వేసింది.  సుర్జీత్ సింగ్ ను తన కుటుంబంతో సహా దేశాన్ని వీడిచి పోవాలని ఆదేశించింది. వియన్నా సదస్సు నిర్ణయాలు, ద్వైపాక్షిక నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని చెబుతూ భారత హై కమిషనర్ కు సమన్లు పంపింది. ఆయన్ను వెంటనే ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది.