రచ్చకెక్కిన సమాజ్ వాదీ పార్టీ గొడవలు....
posted on Oct 24, 2016 @ 11:11AM
యూపీలో సమాజ్ వాదీ పార్టీ కుటుంబ రాజకీయాలతో రచ్చ కెక్కుతుంది. ఇప్పటికే కుటుంబ రాజకీయాలతో పలు ఇబ్బందులు పడుతున్న పార్టీకి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒకపక్క రాష్ట్ర కేబినెట్ నుంచి శివపాల్‌ను తప్పించడం, అఖిలేష్‌కు మద్దతుగా రాంగోపాల్ నిలవడం, ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ వర్గాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ములాయం సింగ్ లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కార్యాలయం వద్ద సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారులు, తిరుగుబాటుదారుల మధ్య గొడవ జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కాగా మరికాసేపట్లో ములాయం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు.