స్వరూపానంద స్వామికి భూతం పట్టింది.. బాబా భక్తుల ఆగ్రహం...
posted on Oct 24, 2016 @ 12:23PM
ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సాయిబాబా అసలు దేవుడు కాదని.. ఏ శాస్ర్తీయ ప్రమాణాల ద్వారా బాబాను పూజిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ భూతాన్ని భక్తులు పూజిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు స్వరూపానంద స్వామిపై సాయిబాబా భక్తులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్వరూపానందను పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ సాయిబాబా భక్తులు నినాదాలు చేస్తున్నారు. తమను చర్చలకు పిలిస్తే స్వరూపానంద నోరు మూయిస్తామని దేవస్థాన పెద్దలు సవాలు విసురుతున్నారు. స్వరూపానందకు భూతం పట్టిందని అన్నారు. దమ్ముంటే చర్చలకు రావాలని అన్నారు. సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదిలేదని సాయి భక్తులు హెచ్చరిస్తున్నారు. సాయిబాబాను దెయ్యం, భూతం అంటూ తమను స్వరూపానంద రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి గతంలో ఒకసారి ఈ విషయంపై పెద్ద దుమారం రేగగా... ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఎంత ఉద్రిక్తంగా మారుతుందో.. చర్చకు స్వరూపానంద స్వామి ఓకే చెబుతారో లేదో చూడాలి.