రతన్ టాటాను పిచ్చోడని అనుకున్నావా?
టాటా గ్రూపు ఛైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. తన ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో సైరస్ మిస్త్రీని తొలగించారు. ప్రస్తుతం రతన్ టాటా బాధ్యతలు స్వీకరించారు. అయితే తనను ఛైర్మన్ పదవి నుండి తొలగించడంపై స్పందించిన సైరస్ మిస్త్రీ.. తనను తొలగించడం అన్యాయమని, కనీస ధర్మాలు పాటించకుండానే తీసేశారని ఆరోపించాడు. సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలపై స్పందించిన రతన్ టాటా లీగల్ కౌన్సిల్, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మనూ సంఘ్వీ స్పందించి సైరస్ మిస్త్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్త్రీ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని, రతన్ టాటాను పిచ్చోడని అనుకున్నావా? అని ప్రశ్నించారు. టాటాల బోర్డును చేతకానిదని భావించి, అధికారం ఉంది కదా అని, తన ఇష్టానికి వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. బోర్డులోని ప్రతి ఒక్కరికీ మిస్త్రీ మీద నమ్మకం పోయిందని.. 9 మంది సభ్యులున్న బోర్డులో ఆరుగురు ఆయన్ను తొలగించాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. మిస్త్రీ గ్రూప్ సంస్థల పరువు తీసే నిర్ణయాలు తీసుకుంటుంటే రతన్ టాటా ఓ బొమ్మలా చూస్తూ ఎలా ఉంటారని సంఘ్వీ ప్రశ్నించారు. కాగా కొత్త ఛైర్మన్ ను నియమించడానికి మరో నాలుగు నెలలు సమయం పడుతుందని రతన్ టాటా చెప్పారు.