సిజేరియన్ ఆపరేషను చిత్రీకరణ, వీడియో అమ్మకం?
posted on Aug 21, 2012 8:58AM
గౌరవప్రదమైన వృత్తి వైద్యవృత్తి. అటువంటి వైద్యవృత్తిలో ద్రోహులు చేరుతున్నారని ఇటీవల విమర్శలు ఎక్కువయ్యాయి. తనను నమ్మి సిజేరియన్ ఆపరేషను చేయించుకునేందుకు వచ్చిన మహిళను, చేసిన ఆపరేషనును కాంపౌండర్ చిత్రీకరించేందుకు డాక్టరు సహకరించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అదీ ఈ చిత్రీకరణను కాంపౌండర్ అమ్ముకోవటంతో ఘటన వివరాలు బయటకు పొక్కాయి. దీంతో ఆపరేషను చేయించుకున్న మహిళ బంధువులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు మొత్తం ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కాంపౌండర్‌ను అరెస్టు చేశారు. డాక్టరును విచారించారు. అదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో ఉన్న మల్లిక ఆసుపత్రిలో ఓ గర్భిణీకి ఇటీవల సిజేరియన్ ఆపరేషను చేశారు. దీన్ని కాంపౌండర్ సెల్‌ఫోను ద్వారా చిత్రీకరించారు. ఈ వీడియో క్లిప్పింగును అమ్మేందుకు కాంపౌండర్ ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాంపౌండర్‌ను అరెస్టు చేశాక నర్సింగ్‌హోం డాక్టర్ ప్రవీణారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న గర్భిణీ బంధువులు పోలీసుస్టేషను ఎదుట ఆందోళనకు దిగారు. తమ విచారణ తరువాత నేరస్తులకు శిక్ష ఉంటుందని పోలీసులు హామీ ఇచ్చాక ఆందోళనకారులు వెనుదిరిగారు. ఈ ఘటన అదిలాబాద్ జిల్లాలో తీవ్రసంచలనమైంది.