కిరణ్ కాలం
posted on Aug 21, 2012 @ 6:57PM
సీఎం కి కాలం కలిసొస్తోంది. మూన్నాళ్ల ముచ్చటే అనుకున్న కుర్చీ వచ్చే ఎన్నికలదాకా పక్కాగా దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్లనుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో సీఎంని మార్చడం కొరివితో తలగోక్కోవడమే అవుతుందని అధిష్ఠానం గట్టిగా అనుకుంటోంది. అందుకే ఎవరెన్ని చెప్పినా ఇప్పుడా విషయం అవసరమా అన్నట్టుగా ఢిల్లీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఎఐసీసీ ప్రథాన కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతానికి అందరి కాన్ సన్ ట్రేషన్ తలవని తలంపుగా వచ్చిపడుతున్న తలనొప్పుల్ని తప్పించుకోవడంమీదే ఉంది. వచ్చే ఎన్నికలనాటికి తప్పుల్ని తవ్వుకుని లెక్కలు చూసుకోకపోతే డిపాజిట్లు కూడా దక్కవన్న భయం కాంగ్రెస్ పెద్దల్ని వెంటాడుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను సొమ్ముచేసుకునే విషయంలో ప్రధాన ప్రతిపక్షపార్టీలు పూర్తిగా వెనకబడిఉన్నాయ్. కానీ.. చివరికి పిల్లిపోరు పిల్లిపోరు పిట్ట తీర్చినట్టుగా కొత్తగా పుట్టిన మరో ప్రాంతీయపార్టీ సీట్లన్నీ తన్నుకుపోతుందేమోనన్న భయం అధిష్ఠానాన్ని బలంగా వేధిస్తోంది. మొన్నటి ఉపఎన్నికల ఫలితాలు ఈ భయాన్ని మరింతగా పెంచాయి. మొన్నటిదాకా కాస్త మెతగ్గా ఉన్న సీఎం ఇప్పుడు తన పదవిని కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. సైలెంట్ గా ఉంటూనే చేయాల్సిన పని చేసుకుపోతూ కుర్చీని కాపాడుకునేందుకు హస్తినలో గట్టిగానే చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతానికి కుర్చీలాటను పక్కనపెట్టాలని అధిష్ఠానం బలంగా నిర్ణయించడంతో కిరణ్ కుమార్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టైంది. రోగీ పాలే కోరాడు, వైద్యుడు పాలే ఇచ్చాడు అన్నట్టుగా ప్రస్తుతానికి సీఎంకి కాలం బాగా కలిసొస్తోంది.