ఒకే రోజు హైకోర్టు రెండు సంచలనతీర్పులు
posted on Aug 22, 2012 @ 3:14PM
ఒకే రోజు హైకోర్టు రెండు సంచలన తీర్పులను ఇచ్చింది. దీని వల్ల ఒకరికి మోదం(ఆనందం), మరొకరికి ఖేదం అన్నట్లుంది ఫలితం. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు ఎన్నిక చెల్లదని ఆయన సమీప ప్రత్యర్థి పిటీషను దాఖలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు విచారించి రాంబాబు ఎన్నిక సక్రమంగానే జరిగిందని హైకోర్టు గుర్తించింది. కావాలనే అతనిపై కేసుపెట్టారని గమనించి ఆ పిటీషను హైకోర్టు కొట్టివేసింది. దీంతో రాంబాబు అనుచరులు విజయోత్సాహంతో గిద్దలూరులో పండుగ వాతావరణం సృష్టించారు.
అలానే విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే జనార్దన్ థాట్‌రాజ్ ఎన్నికపై కొందరు సవాల్ చేస్తూ కోర్టులో పిటీషను దాఖలు చేశారు. థాట్‌రాజ్ సరైన కులధృవీకరణ సమర్పించకుండానే ఎన్నికల కమిషనుని మోసం చేశారని ప్రత్యర్థులు ఆధారాలతో సహా నిరూపించారు. జనార్దన్ మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు కూడా కావడం గమనార్హం.
దీంతో పూర్తిగా విచారణ జరిపిన తరువాత జనార్దన్ గిరిజనుడు కాదని రాష్ట్రహైకోర్టు తీర్పును వెలువరించింది. సరైన కులధృవీకరణ సమర్పించలేదని కోర్టు తప్పుపట్టింది. దీంతో టీడిపి అభ్యర్థి నిమ్మక జయరాజ్ అక్కడ విజయం సాధించినట్లయింది. ఈ తీర్పుతో జనార్దన్ థాట్‌రాజ్ అనుచరులు విషాదంలో మునిగిపోయారు. విజయం సాధించినా ఎమ్మెల్యే కాలేకపోయామని థాట్‌రాజ్ వాపోతున్నారు.