తెలుగుదేశానికి వంటేరు గుడ్‌బై
posted on Aug 22, 2012 @ 3:26PM
తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లా నాయకుడు వంటేరు వేణుగోపాలరెడ్డి రాజీనామా చేయనున్నారు. త్వరలో తన రాజీనామా పత్రాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించనున్నారు. వంటేరు వేణుగోపాలరెడ్డి నెల్లూరు పార్లమెంటరీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరుపున 2012 ఉపఎన్నికల బరిలో నిలిచారు. అప్పుడు కూడా నామినేషన్ల ఘట్టం ముగింపు దశలో తాను పోటీ నుంచి వైదొలుగుతానని వంటేరు ప్రచారంలో ఉన్న చంద్రబాబును కలిశారు. అకస్మాత్తుగా పోటీ నుంచి తప్పుకుంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మాయని మచ్చ మిగిలిపోతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
నెల్లూరు లోక్‌సభ స్థానం పోయినా పర్వాలేదు కానీ, పోటీ చేయాల్సిందేనని వేణుగోపాలరెడ్డికి సర్దిచెప్పారు. తప్పని సరి పరిస్థితుల్లో చంద్రబాబు బలవంతంపై పోటీ చేయటానికి ఒప్పుకున్న వంటేరు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనని వేణుగోపాలరెడ్డి చివరికి తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందని తెలుగుదేశం నేతలు ఆరా తీస్తున్నారు. తన రాజీనామా ఆమోదించాకే అస్సలు విషయం మీడియా ముందు బయటపెడతానని వేణుగోపాలరెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో ఇంకేమి విషయం ఉందో అన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది. కొంపదీసి వంటేరు కూడా వైకాపా బాట పడుతున్నారా? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారా? ఏం జరగనుందో? చూద్దాం!