వట్టి ఇంట్లో మంత్రుల మంతనాలు
posted on Aug 21, 2012 @ 3:28PM
వై.ఎస్ హయాంలో మంత్రి మండలి సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మంత్రుల మెడకు చుట్టుకుంటున్నాయి. కదిలిన అవినీతి తేనెతుట్టె మొదట మోపిదేవిని జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసింది. ఇప్పుడు వంతు ధర్మానవరకూ వచ్చింది. తర్వాత్తర్వాత మెల్లమెల్లగా ఈ నిప్పు అందరికీ అంటుకునేలా కనిపిస్తోంది. మంత్రులకు గుండెల్లో గుబులు మొదలైంది. తమను తాము కాపాడుకోవడానికి కీలక శాఖల్లో ఉన్న మంత్రులంతా కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. వట్టి ఇంట్లో కీలక శాఖల్లో ఉన్న సీనియర్ మంత్రులు సమావేశమయ్యారు. ధర్మానకు సీనియర్ మంత్రులంతా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నించే అధికారం, తప్పుపట్టే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదంటూ కొందరు సీనియర్ మంత్రులు వాదించారు. మరికొందరు ఈ విషయంలో సుప్రీంకోర్ట్ స్పష్టమైన మార్గనిర్దేశం చేసిందని చెప్పుకొచ్చారు. ఏది ఎలా ఉన్నా.. అమాత్యవర్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న విషయం తాజా సమావేశంతో తేటతెల్లమైపోయింది. ఎప్పుడేం జరుగుతుందోనని, ఎప్పుడేం వినాల్సొస్తుందోనని సీనియర్ మంత్రులు హడలిపోతున్నారు. పైకి మాత్రం తెచ్చిపెట్టుకున్న ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సుప్రీంకోర్ట్ నోటీసులు అందుకున్నమంత్రుల్లో ఎవరికీ ఏమీ జరగదని ఒకరికొకరు భరోసా ఇచ్చుకున్నారు. దీనిపై వెంటనే ముఖ్యమంత్రితోకూడా మాట్లాడాలని నిర్ణయించారు. సీబీఐ చార్జ్ షీట్ లో పేర్లున్న మంత్రులను రక్షించడానికి ప్రయత్నాలు చేయాల్సిందిపోయి, వాళ్ల వ్యవహారాన్ని అధిష్ఠానమే చూసుకుంటుందంటూ బొత్స కామెంట్ చేయడంపై సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.