డీజిల్ మండింది...గ్యాస్ బరువైంది!
posted on Sep 15, 2012 @ 12:03PM
దినదినగండం నూరేళ్ళ ఆయుష్షులా జీవితం గడిపేస్తున్న సామాన్యుడంటే ఏలినవారికి చాలా చులకన! అందుకే ఉన్నవాడూ లేనివాడూ అనే తేడా లేకుండా అందరూ వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం విపరీతంగా పెంచేస్తోంది. ఈ క్రమంలోనే మొన్న విద్యుత్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వడ్డిస్తే... నేడు కేంద్రం డీజిల్ ధరని పెంచేసి గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధించింది.నిత్యావసర వస్తువుల పంపిణీ డీజిల్‌తో నడిచే మోటార్ వెహికల్స్‌పైన ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెంచేసినట్లుగా భావించాల్సిఉంటుంది. వంటగ్యాస్‌ను ఒక కుటుంబానికి ఏడాదికి ఆరు సిలిండర్ల వరకే పరిమితం చేసింది. ఆ కుటుంబం టైమ్ బాగోలేక ఏడోబండకోసం ప్రయత్నిస్తేమాత్రం సుమారుగా 750 రూపాయలు చెల్లించాల్సిందే! అంటే మామూలుగా తీసుకునే గ్యాస్ సిలిండర్ ధరకు సుమారుగా రెట్టింపు చెల్లించుకోవల్సి వస్తుంది. ఇది ఏంటని అడిగితే ‘ చేప..చేప... ఎందుకెండలేదు...’ కథ చెప్పుకొస్తారు. నిత్యావసర ధరలు నింగినంటి అందకుండా పోతుంటే... గ్యాస్ బరువై...దాని క్రింద పడి నలిగిపోయే పరిస్థితే వస్తుంటే.. సామాన్యుడు... పచ్చికూరలే శరణమని భావించి.. ఆదిమానవుని అలవాటులోకి మారినా ఆశ్చర్యపోనక్కరలేదు.!