చంద్రబాబు పేరిట ఉన్నది 31.97లక్షలే
posted on Sep 13, 2012 @ 3:55PM
వై.ఎస్ బతికుంటే, ఆయన ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉండుంటే “డబ్బున్నోళ్లలో చంద్రబాబుది నిజంగా చాలా నిరుపేద స్థితి” అంటూ చంద్రబాబు మీద కచ్చితంగా సెటైర్లేసేవాళ్లు. ఇప్పుడాయనకు ఆ పదవీలేదు. రాజకీయాలమీద అంత ఆసక్తీ లేదు. ఏదో కృష్ణా, రామా అనుకుంటూ, వీలైనప్పుడల్లా లంకపొగాకు చుట్ట కాల్చుకుంటూ తమిళనాడు గవర్నర్ గిరీలో హాయిగా సేదతీరుతున్నారు. రాజకీయాల్లో పారదర్శకంగా ఉండాలన్న ఆలోచనతో తాను నిజంగా తనపేరిట ఉన్న ఆస్తుల్ని ప్రకటించానని చంద్రబాబు గట్టిగానే చెబుతున్నారు. సింగపూర్ లో ఉన్న ఆస్తుల వివరాలు కూడా ప్రకటిస్తే బాగుండేదంటూ చురకలు వేస్తున్న ప్రతిపక్ష నేతలకు బాబు దీటుగానే సమాధానం చెబుతున్నారు. నిజంగా సింగపూర్ లో తనకు ఆస్తులున్నాయని నిరుపిస్తే మొత్తం ఆస్తులన్నీ, నిరూపించినవాళ్లకే రాసేస్తానని సవాల్ చేస్తున్నారు. ఏతావాతా చంద్రబాబు ఈసారి ప్రకటించిన ఆస్తుల వివరాలమీద ఓ లుక్కేస్తే .. కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.35.59 కోట్లు. చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 31.97 లక్షలు. 1985 నుంచి 1992 మధ్య కట్టిన ఇల్లు, కొనుక్కున్న కారు చంద్రబాబు పేరుమీదే ఉన్నాయ్. బాబు భార్య భువనేశ్వరి పేరుమీదున్న ఆస్తుల విలువ రూ.24.57 కోట్లు. కుమారుడు లోకేష్ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 6.62 కోట్లు. కోడలు బ్రహ్మణి పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 2.09 కోట్లు.