ప్రాణాంతకంగా మారిన బయో మెడికల్ వ్యర్ధాలు
posted on Sep 10, 2012 @ 6:34PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల నుండి వెలువడుతున్న బయోమెడికల్ వ్యర్ధాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. భూమిలో కలిసిపోయే గుణంలేని ఈ వ్యర్ధాలను ప్రత్యేక ప్లాంట్లలో నిర్వీర్యంచేయకపోవడంతో భవిష్యత్‌లో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసివస్తుందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల నుండి నిత్యం టన్నులకొద్దీ వ్యర్ధాలు వెలువడి ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 6వేలకుపైగా ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే బయో మెడికల్ వ్యర్ధాల నియంత్రణను అమలుచేస్తున్నారు. మిగిలిన వాటి నుండి టన్నుల కొద్దీ వ్యర్ధాలను జనావాసాల్లోకి తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 377 క్లినిక్‌లు తమ వ్యర్ధపదార్ధాల పరిష్కారం కోసం ఉమ్మడి బయో మెడికల్ వ్యర్ధాల శుద్ధి సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. మిగిలిన ఆసుపత్రుల గురించి పర్యవేక్షించే యంత్రాంగం పనిచేస్తున్న దాఖలాలు కనిపించటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.