కాంగ్రెస్.. ‘రిచ్’ రేసులో ముందు!
posted on Sep 12, 2012 @ 9:54AM
సాధారణంగా ఒక కంపెనీ వ్యవస్థాపకుడు అధికమొత్తంలో పెట్టుబడి పెట్టి స్థాపిస్తే, ఆ తర్వాత అతని ఉత్సాహన్ని బట్టి మరికొందరు అందులో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అలా.. అలా.. ఆ కంపెనీలో ఎంతోమంది పెట్టుబడులు పెడతారు. ఎవరు పెట్టుబడి పెట్టినా లాభాలు రావాలనే ఆశిస్తారు. సదుపాయాలు పొందాలనే కోరుకుంటారు. నేడు రాజకీయ పార్టీలు కూడా కంపెనీల్లా తయారయ్యాయి. ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు విరాళాలు ఇస్తున్నారు. అలా విరాళాలతో దేశంలోని రిచ్‌పార్టీలలో మొదటిస్థానంలో కాంగ్రెస్ ఉంటే, రెండోస్థానంలో బి.జె.పి. ఉంది. అంతర్గత గొడవల్లోనేకాదు, ‘రిచ్’ విషయంలో కూడా ముందే. శభాష్! అలాగే రాష్ట్రాల వారీగా ఆయా రాష్ట్రాలలోని ప్రముఖ ప్రాంతీయపార్టీలు ప్రథమ, ద్వితీయ స్థానాలను ఆక్రమిస్తున్నాయి. ఈ పార్టీలన్నీ ఇలా రిచ్‌పార్టీలుగా మారడానికి ఎంతోమంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు విరాళాలు అందించారు. విరాళాలు స్వచ్చంధ సంస్థలు ఇవ్వడం పరిపాటి. ఎందుకంటే తద్వారా ఎంతోమంది ప్రజలకు సేవ చేసినట్లుగా ఉంటుంది. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయి. మరి పార్టీలకు ఏం ఆశించి విరాళాలు ఇస్తారు? దీనికి సమాధానం కొంచెం రాజకీయం తెలిసిన ఎవరికైనా అర్ధం అవుతుంది. కాకుంటే అందరిలా మనం అనుకోవాల్సిందే ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక...’ అని...!