వైకాపా కాంగ్రెస్ లో కలిసిపోతుందా...?
posted on Sep 13, 2012 @ 5:49PM
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పరిస్థితి ఇప్పుడు ముందుగొయ్యి వెనక నుయ్యిలా తయారయ్యింది. పార్టీని తిరిగి కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో జగన్ వర్గం నేతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. వై.ఎస్ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీని ముక్కతిట్లు తిట్టి జగన్ పక్షాన చేరినవాళ్లకు ఇప్పుడు పరిస్థితి అర్ధంకావట్లేదు. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయితే అప్పట్లో అంతగా తిట్టిపోసి బైటికొచ్చిన నేతలు ఇప్పుడు ఏముఖం పెట్టుకుని తిరిగెళ్లాలో అర్థం కావట్లేదు. వైఎస్సార్ సీపీ నిజంగా కాంగ్రెస్ లో కలిసిపోతే జగన్ కచ్చితంగా సీఎం అయి తీరతాడన్న నమ్మకంతో వేరేపార్టీలనుంచి వలసొచ్చి వైకాపాలో చేరుతున్న వాళ్ల పరిస్థితి దారుణాతి దారుణంగా తయారవుతుందన్న భయాలుకూడా విపరీతంగా పెరిగిపోతున్నాయ్. ఉన్నపార్టీలో కాస్త నిమ్మళంగానే ఉన్నా సీటుకోసం జగన్ పార్టీవైపుకి దూకుతున్న నేతలు తీరావచ్చాక చేతికి చిప్పే మిగులుతుందేమో అన్న భయంతో వణికిపోతున్నారు.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, జగన్ వర్గం నేతలు బజారునపడి అధికార వ్యామోహంతో నడిరోడ్డుమీద బలాబలాలు తేల్చుకుంటున్న తీరునుకూడా ప్రజలు నిశితంగా గమినిస్తూనే ఉన్నారు. పార్టీ ఇప్పటివరకూ సంస్థాగతంగా పటిష్టం కాలేదని వై.ఎస్ సతీమణి విజయలక్ష్మి బలంగా నమ్ముతున్నారని, అందుకే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే దిశగా ప్రకటనలు చేస్తున్నారనీ వైకాపా నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఉపఎన్నికల్లో వైకాపా సత్తాని చాటగలిగినా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం డొల్లతనం బైటపడుతుందన్న భయం పై స్థాయిలో గట్టిగానే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ నేతలుకూడా అనుకుంటున్నారు. వై.ఎస్ జగన్ మాత్రం తన సత్తాని కాంగ్రెస్ కి ఇంకా గట్టిగా రుచిచూపించాలన్న ఉబలాటంలోనే ఉన్నారని, విజయమ్మ సలహాకి మొగ్గుచూపడం లేదని మరో టాక్ కూడా గట్టిగా నడుస్తోంది. ఇప్పుడు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ప్రజల్లో వ్యతిరేకతవస్తుందన్న భావనని జగన్ గట్టిగా వెలిబుచ్చుతున్నట్టు సమాచారం. జగన్ కి కుర్చీని కట్టబెట్టడానికి సోనియా నుంచి గట్టి హామీ వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ని తిరిగి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే సబబని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి గట్టిగా అభిప్రాయపడుతున్నారని విశ్వసనీయ వర్గాల భోగట్టా..