జగన్ పార్టీ నేతల కుమ్ములాటలు
posted on Sep 12, 2012 @ 10:40AM
అధికారం అంతా అధిష్టానం చేతిలోనే ఉన్నా లోకల్‌గా తానే గొప్పంటూ నిరూపించుకోవాలన్న తపన కాంగ్రెస్ లోనే ఎక్కువగా వుంటుందన్నది నిజం ! ప్రాంతీయ పార్టీల హవా మొదలయిన తర్వాత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారాన్ని కైవసం చేసుకోవడంతో దేశం లోనూ ఆధిపత్య పోరు మొదలైంది. అదిప్పుడు నారా, నందమూరి వంశాల మధ్య నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. ఇదిలా వుంటే` రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అవిర్భవించిన వైఎస్‌ఆర్‌సిపి పేద ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీగా చెప్పుకుంటున్నప్పటికీ, జగన్ తన సంక్షేమం కోసమే పార్టీ పెట్టారన్నది విమర్శకుల మాట! అక్రమాస్తుల కేసులో జగన్ చంచల్‌గూడా జైలుకు వెళ్ళడంతో పార్టీ పగ్గాల కోసం షర్మిల పోటీపడుతున్నారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఆ నేపధ్యంలోనే షర్మిల ఉప ఎన్నికలయ్యిం తర్వాత ఉన్నట్టుండి బెంగళూరు వెళ్ళిపోయారంటారు. అసలు నేత జగన్ జైలుకెళ్లడం ఎన్నికల ప్రచారంలో ఫ్యానుగాలి హోరు బలంగా వినిపించిన షర్మిల బెంగళూరుకు వెళ్ళిపోవడం నేపథ్యంలో లోకల్‌గా తామే హీరోలం కావాలని ఆ పార్టీకి చెందిన చాలా మందే ప్రయత్నాలు చేసేసుకుంటున్నారు. అందుకు మొన్న ఇబ్రహీంపట్నం, మాల్కాజ్‌గిరి, నిన్న జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలే సాక్షి! తూర్పు పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో కూడా పార్టీలో పట్టుకోసం లోకల్ నేతల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందని తెలుస్తోంది. ఇవన్నీ`2014 ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ల కోసం ఇప్పట్నుంచే జరుగుతున్న ప్రయత్నాలేనంటూ ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.