త్వరలో తెలంగాణలో విజయమ్మ ఓదార్పు యాత్రలు?
posted on Jun 15, 2012 @ 5:08PM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ త్వరలో తెలంగాణా ప్రాంతంలో ఓదార్పుయాత్ర చేపట్టబోతున్నట్లు తెలిసింది. ఇటీవల ఉపఎన్నికల్లో ఆమె తన కుమార్తె షర్మిలతో కలిసి పరకాలలో ప్రచారం చేశారు. ఈ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఇకపై ఆమెతోనే తెలంగాణా ప్రాంతంలో ఓదార్పుయాత్రలు నిర్వహించాలని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. ఈ ఓదార్పుయాత్రల్లో విజయమ్మతో పాటు ఆమె కుమార్తె షర్మిల కూడా పాల్గొనబోతున్నారు. గతంలో జగన్ తెలంగాణా ప్రాంతంలో ఓదార్పుయాత్రకు బయలుదేరినప్పుడు అక్కడి టి.ఆర్.ఎస్. కార్యకర్తలు, విద్యార్థులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఓదార్పుయాత్రాలు చేయటానికి జగన్ ప్రయత్నించలేదు. ఉపఎన్నికల షెడ్యూల్ తర్వాత జగన్ అరెస్ట్ కావడం, పరకాల నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ పోటీ చేస్తుండడంతో ఇటీవల విజయమ్మ, షర్మిల అక్కడ విజయవంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ స్పందన కూడా బాగానే ఉండడంతో వెంటనే ఆ ఇద్దరితో తెలంగాణలో ఓదార్పు యాత్రలు ప్రారంభించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.