త్వరలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్
posted on Jun 16, 2012 @ 12:11PM
ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిన తరువాత టిడిపి నేతలు ఆ పార్టీకి దగ్గరవుతున్నారు. టిడిపి నేత తలసాని శ్రీనివాసయాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన విషయం రాజకీయ వర్గాల వారికి తెలిసిందే. ఆయనతో పాటు టిడిపి శ్రేణుల్లో చాలా మందిని తీసుకురావచ్చని వైకాపా నాయకులు భావిన్నారు. అయితే తాజాగా ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. బిసి వర్గ నాయకుడిగా పేరుగాంచిన తలసాని సికింద్రాబాద్ లో గెలుపుగుర్రమనే చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన తలసాని బలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరం. ఇప్పటికే సికింద్రాబాద్ అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని వైకాపా ఖరారు చేసిందని సమాచారం. టిడిపి కార్యకర్తల బలంతో క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆయన 2014 ఎన్నికల్లో పాగా వేయవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వైకాపా ఎన్నికల ప్రణాళిక మేరకు తలసాని సరితూగుతారని చెబుతున్నారు. కాగా, తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణా జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారతాయి.