నిజమవుతున్న చంద్రబాబు అనుమానాలు!
posted on Jun 17, 2012 @ 10:14AM
కడపనుంచి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఎన్నికైన తరువాత తమ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అనేకమంది హత్యకు గురయ్యారని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ ఆరోపణను అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించు కోలేదు. రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నెగ్గితే ఈ పరిస్థితి తప్పదని బాబు అనుమానించారు. ఆయన అనుమానం నిజమైంది. ఉపఎన్నికల ఫలితాల తరువాత ఫ్యాక్షనిస్టులు రెచ్చిపోతున్నారని ఆందోళనలు ఎక్కువయ్యాయి. ప్రత్యేకించి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో దీని ప్రభావం కనిపిస్తోందని తెలుగుదేశం నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. గెలుపు ఆనందంలో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అనంతపురం బత్తలపల్లి మండలంలోని లింగారెడ్డి పల్లిలో రచ్చబండపై కూర్చుని ఉన్న తెలుగుదేశం కార్యకర్త లక్ష్మన్నతో ముందు వాగ్యుద్ధానికి దిగారు. తరువాత ఆయన్ని తీవ్రస్థాయిలో గాయపరిచారు. ఈయన్ని బెంగళూరు ఆసుపత్రికి బంధువులు తరలించేలోపే మార్గమధ్యంలో మరణించారు. ఎన్నికల అంశంపై జరిగిన చర్చకే ఇలా తెగిస్తే ఇంక మామూలుగా మా పరిస్థితి ఏమిటని తెలుగుదేశం కార్యకర్తలు, జిల్లా నేతలు చంద్రబాబు దృష్టికి ఈ సంఘటనను తీసుకువెళ్ళారు. ఆయన ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఆలోచించి సమాధానమిస్తానని తెలిపారని సమాచారం.