జగన్ పై మరింత కఠిన చర్యలు తప్పవా?
posted on Jun 16, 2012 @ 12:04PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం గణనీయంగా పెరగడంతో ఎలాగైనా జగన్ ను కట్టడి చేసేందుకు తీహార్ జైలుకు పంపుతారని ఇక్కడి రాజకీయ శ్రేణులు అంచనా వేస్తున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు జగన్ ను అప్పగించి తీహార్ జైలుకు మారిస్తే రాష్ట్రంలో జగన్ ప్రభావాన్ని తగ్గించవచ్చని సీనియర్ నాయకులు అనుకుంటున్నారు. సోనియాను ధిక్కరించిన జగన్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ గా ఉందని, జగన్ మెడలు వంచేందుకు తీహార్ జైలుకు తరలిస్తారని పలువురు నాయకులు పేర్కొంటున్నారు. గతంలో పప్పూయాదవ్ మెడలు వంచిన తీరును గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ కు పెరుగుతున్న పలుకుబడిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతానికి వెనకడుగు వేసినట్లు కనిపించినా ఢిల్లీ మాత్రం పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. జగన్ కాంగ్రెస్ తో రాజీపడే విధంగా ఈ వ్యూహం ఉంటుందని భావిస్తున్నారు. తాత్కాలిక విజయాలు సాధించినా భవిష్యత్ లో జగన్ భారీ నష్టం చవి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా దెబ్బకొట్టే దానికి బదులు ఆర్థిక మూలాలను చేరిపెసేందుకు కాంగ్రెస్ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తున్నది.