హంద్రీనీవా గుత్తేదారుపై సర్కారు ప్రేమ?
posted on Jun 22, 2012 @ 5:45PM
హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కుంటూనే ఉంది. ఇక్కడ పనులు చేయకుండా గుత్తేదారు సొమ్ము చేసుకున్నారని విచారణాధికారి నిర్ధారించారు. తగిన ఆధారాలు ఉన్నందున గుత్తేదారుపై చర్యలకు సిఫార్సు చేశారు. అయినా ప్రభుత్వం ఆ సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫైలు పక్కన పడేసింది. ఎందుకీ గుత్తేదారుపై సర్కారుకు ప్రేమ పొంగుతోందని కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ పథకం కింద 23వ ప్యాకేజీ పనిని బ్యాక్‌బోన్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ చేయని పనులకు అదనపు బిల్లులు పెట్టి కోట్ల రూపాయలు పొందింది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ పనిపై విచారణ జరిపి పనితో సంబంధమున్న ఇంజనీర్లను ప్రభుత్వం సాయంతో సస్పెండ్ చేయించింది. ఈ కేసులో చిక్కుకున్న ఇంజనీర్లకు పదవీవిరమణ తరువాత పూర్తిస్థాయి పింఛను కూడా చెల్లించలేదు. ఇంజనీర్లతో పాటు బ్యాక్‌బోన్ సంస్థపైనా, పని చేశారని ధృవీకరించిన థర్డ్‌పార్టీ నాణ్యతా సంస్థ పైనా చర్య తీసుకోవాలని విచారణాధికారి ప్రభుత్వానికి తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టేసింది. గుత్తేదారుపై చర్యతీసుకుంటే ఇంకెందరిపై చర్యలు తీసుకోవాలో అన్నట్లు మౌనముద్ర దాల్చింది. తాజాగా విజిలెన్స్ కమిషన్ నీటిపారుదల శాఖకు రాసిన లేఖలో ఆ చర్యలు గురించి ప్రస్తావించింది. గుత్తేదారును బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు థర్డ్‌పార్టీ సంస్థను తొలగిస్తూ చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన సమాచారం తమకు అందజేయాలని విజిలెన్స్ లేఖలో కోరింది.