పీసీసీపై పదవిపై కన్నేసిన డి.ఎస్.?
posted on Jun 22, 2012 @ 10:51AM
పీసీసీ చైర్మన్ పదవిపై మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కన్నేశారు. ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉన్నాయని ఎఐసిసి చైర్మన్ సోనియాగాంధీ సీరియస్ గా ఉండటంతో ఆమెను కలిసేందుకు డి.ఎస్. ప్రయత్నిస్తున్నారు. అలానే వాయలార్ రవిని, గులాంనబీ ఆజాద్ తదితరులతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆయన చర్చించనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని అభినందించేందుకు బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన కేంద్రనాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. తాను పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు క్రమశిక్షణ ఉండేదనీ, ఇప్పుడు పార్టీలో అస్సలు క్రమశిక్షణే లేదనీ డి.ఎస్. వివరించారట. అలానే ఎన్నికల్లో అతిగా అంచనాలు వేసి ఘోరంగా దెబ్బతిన్నామని తప్పంతా పీసీసీ బొత్సా సత్యనారాయనపైన, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి పైన నెట్టేస్తూ కేంద్రనాయకులకు వారిద్దరిపై సదభిప్రాయం లేకుండా రాజకీయం చేసేందుకు డి.ఎస్. ప్రయత్నిస్తున్నారని తెలిసింది. పీసీసి చీఫ్ పదవినుంచి బొత్స తప్పుకోవాల్సిన పరిస్థితే వస్తే తాను కాంగ్రెస్ కోసం ఎటువంటి సేవనైనా చేయగలనని డి.ఎస్. అన్నారట. దీనికి కేంద్రనాయకులు నవ్వుతూ సోనియా మేడమ్ తో మాట్లాడతామన్నారట. సోనియా తల్చుకుంటే తనకు తిరిగి పీసీసీ చీఫ్ లభించగలదని డి.ఎస్. ఆశిస్తున్నారని తెలిసింది. అందుకే ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు మేడమ్ ఆశీస్సులు తీసుకురావాలని డి.ఎస్. చూస్తున్నారట.