ఏసిబికి రాజకీయ ఉద్దేశ్యం అంటగట్టిన ఎమ్మెల్యే రామకృష్ణ
posted on Jun 22, 2012 @ 5:38PM
మద్యం ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి విశాఖతూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎసిబికి రాజకీయ ఉద్దేశ్యం అంటగట్టినట్లుంది ఆయన విచారణలో ప్రకటన. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రామకృష్ణ ఎసిబి ఎదుట సవాల్ చేశారు. తనను విచారిస్తున్నది విచారణ సంస్థ మాత్రమే అన్న విషయాన్ని ఆయన మరిచిపోయినట్లుందీ వ్యాఖ్య. తాను నిజాయితీపరుడిని అని మాత్రమే వివరించాలి. ఇంకా దానికి ఏమైనా సాక్ష్యాలుంటే వాటిని ఏసిబి ముందు ఉంచాలి. ఈ రెండూ చేయకుండా ఒక ఎమ్మెల్యే తన రాజకీయజీవితం గురించి విచారణలో మాట్లాడటం ఎంతవరకూ కరెక్టు. ఏసిబి తమ విచారణలో ఎంతో ఓర్పు వహించదనటానికి ఈయన సవాల్ విసిరినా మౌనం వహించటమే నిదర్శనం. మూడున్నర గంటల పాటు విచారణ జరిగితే ఏసిబి తనకు వచ్చిన ఆరోపణలు గురించి అనుమానాలను నివృత్తి చేసుకునే దిశగా ప్రయత్నించింది. అదీ జనప్రియసిండికేట్ రికార్డుల్లో దొరికిన సమాచారం ఆధారంగానే ఎమ్మెల్యేను విచారించింది. దానికి సమాధానాలిస్తే సరిపోతుంది కానీ, విచారణ సంస్థను సవాల్ చేయటం ఓ పరిణతి చెందిన ఎమ్మెల్యేకు తగునా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి ఈయనతో పాటు పెందుర్తి మాజీ కార్పొరేటర్ శరగడం చినఅప్పలరాజును కూడా ఏసిబి విచారించింది. ఆయన మాత్రం ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యంతో కూడిన సవాల్ విసరలేదని తెలుస్తోంది.