‘మీడియా’తో వార్ జగన్ బెయిల్ కోసమేనా ?
posted on Jun 22, 2012 @ 3:59PM
అక్రమాస్తుల కేసులో చెంచల్‌గూడా జైలులో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి తన బెయిల్ కోసం సాక్షి దినపత్రిక, న్యూస్‌ఛానల్ ఉపయోగించుకుని మీడియాతో యుద్ధానికి దిగారు. నేరుగా తాను సీనులో లేకపోయినా జగన్ జైలులోనే ఉండి మంత్రాంగం నడుపుతున్నారని, ఆయన ఆదేశాలపైనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, న్యూస్‌ఛానల్, పత్రిక సిబ్బంది ఇతర పత్రికలపై కయ్యానికి కాలుదువ్వారని తెలుస్తోంది. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో? అప్పుడు తయారు చేయించే బులెటిన్స్(ప్రత్యేక సంచికలు) ఎలా ఉండాలో? కూడా జగన్ నిర్దేశించారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు తాను బెయిల్‌పై బయటకు వచ్చేందుకు హైకోర్టులో పిటీషను వేసిన జగన్ తరుపున న్యాయవాదులపై ఇతర మీడియా దృష్టి పడకూడదనే ఈ యుద్దాన్ని జగన్ ఒక ప్రణాళిక ప్రకారం సృష్టించారని తెలుస్తోంది. ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, క్రైమ్‌రిపోర్టర్లు తన బెయిల్ గురించి వార్తలు గుప్పిస్తే న్యాయమూర్తి విచారణ ముగిసేంత వరకూ జైలు నుంచి రానీయరేమో అన్న అనుమానంతోనే జగన్ మీడిమా మధ్యవార్‌కు వ్యూహాన్ని అమలు చేశారు. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి అసెంబ్లీలోని గాంధీబొమ్మ ముందు కూర్చోబెట్టి మొత్తం నాటకం అంతా సాక్షి ఛానల్, పత్రిక ఆడేశాయి. అంటే వారిని కేవలం పాత్రధారులుగా చూపారే కానీ, మొత్తం అన్ని అంకాలూ కూర్చిరచించింది మాత్రం జగన్ అని అనుమానాలు పెల్లుబుకుతున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన కాంగ్రెస్ ఇంకా కసరత్తులు చేస్తూ ఉన్న ఈ సమయంలోనే తన బెయిల్ మంజూరు అవ్వాలని, లేకపోతే ఇంకెన్నేళ్లు గడిచినా బయటికి రానీయరని జగన్ అనుమానించారు. అందుకే తెలివిగా బెయిల్ పిటీషన్ మూవ్ చేస్తూనే గాంధీబొమ్మ వద్ద ఎమ్మెల్యేలను ఉంచి సాక్షితో ముందు సిబిఐ జెడి లక్ష్మినారాయణపై విమర్శలు చేయించారు. ఇప్పటి వరకూ చీప్‌ట్రిక్స్ పెద్దగా ప్లే చేయని జగన్ ఆ నాయకులను తెరపై చూపి క్రైమ్‌రిపోర్టర్లు, ఇతర ప్రతినిధులు సిబిఐ జెడికి ఫోన్‌కాల్స్ చేసిన వివరాలు(లిస్ట్) వెలుగులోకి తెచ్చారు. వార్తల కోసం జెడితో మాట్లాడటమే తప్పు అన్నట్లు తన ఛానల్, పత్రికల్లో వార్తలు రాయించారు. పైగా జెడికి సంబంధించిన మొత్తం సమాచారం తామూ సేకరిస్తున్నామని సాక్షిఛానల్, పత్రిక నిరూపించుకున్నాయి. అంటే సిబిఐ ఎంక్వయిరీకి సమాంతరంగా తమ ఛానల్ విలేకరులూ విషయాలను ఎంక్వయిరీ చేయగలరని చూపించారు. దీంతో తన ప్రతీ అడుగూ సాక్షికి తెలుస్తుందన్న భయాన్ని సిబిఐజెడికి కల్పించాలన్నది జగన్ ఉద్దేశ్యం కావచ్చు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా జగన్ పాచిక పారిందనే చెప్పాలి. తనపై విమర్శలు వచ్చినా జగన్ ఏమి చేస్తున్నారో అన్న అంశం నుంచి మీడియా దృష్టి మళ్లించగలిగారు. ప్రెస్‌క్లబ్బులు, క్రైమ్‌రిపోర్టర్ల అసోసియేషన్లు, ఎపిడబ్ల్యుజె, ఎపిడబ్ల్యుజెఎఫ్ తదితరాలు సాక్షిఛానల్, పత్రిక చేసిన ఆరోపణలపై మల్లగుల్లాలు పడుతున్నాయి. హైకోర్టులో తన బెయిల్‌పై విచారణ చేయించుకుని జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఈ మాత్రం మళ్లింపు అవకాశం ఉపయోగించుకోవాలని జగన్ న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. తన బెయిల్ కోసం ఇంత నాటకాన్ని వెనుకుండి నడిపించిన జగన్ భవిష్యత్తులో సాక్షి సిబ్బందిని ఇతర మీడియా నుంచి దూరమయ్యేందుకు తొలిబీజం వేసినట్లే. యాజమాన్యంకు వ్యతిరేకంగా ఇకపై సాక్షి పత్రిక, ఛానల్ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడ్డా బయటకు రాలేని పరిస్థితి ఎదురవుతోంది. మరో కోణంలో పరిశీలిస్తే ఈ 15స్థానాల్లో గెలుపొందినందుకే వై.కా.పా. నేతలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, క్రైమ్‌రిపోర్టర్లను బెదిరిస్తే భవిష్యత్తులో అసెంబ్లీలో అధికారపక్షంగా మారితే ఇక దాడులు ఊహి(భరి)ంచగలమా అన్న కొత్తప్రశ్నకు ఈ సంఘటన పునాది అయింది.