పెట్రేగిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు?
posted on Jun 21, 2012 @ 10:41AM
చిత్తూరు జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం కలపను తరలించటానికి అలవాటుపడ్డ స్మగ్లర్లు పెట్రేగిపోతున్నారు. వీరిని అటు అతవీశాఖాధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ అదుపు చేయటం కుదరటం లేదు. తాజాగా ఈ స్మగ్లర్లు తుపాకులతో తిరుగుతుండటం సంచలనమవుతోంది. తమను ఎవరి వెంబడించిన ఆ స్మగ్లర్లు తుపాకులతో బెదిరిస్తున్నారు. ఇంకా పోలీసులైతే ఎదురుకాల్పులకు కూడా సిద్ధమవుతున్నారు. ఒకవైపు మావోలు, మరోవైపు స్మగ్లర్లు తుపాకులతో ఎదిరించటంతో విసుగుచెందిన పోలీసులు స్మగ్లర్ల వెంటబడ్డారు. చిత్తూరుజిల్లా శంకరంపల్లిలో ఎదురుకాల్పులకు సిద్ధమయ్యారు. హోరాహోరీగా కాల్పులు జరపటంతో పోలీసులు, స్మగ్లర్లు బాగానే ఉన్నా మధ్యలో మరెవరో మృతి చెందారని సమాచారం. ఒకవైపు రాజకీయ అండ, మరోవైపు సొంతబలగాలు పెంచుకునే దిశగా స్మగ్లర్లు కృషి చేస్తుండటంతో భద్రతా సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళనలు ప్రారంభమయ్యాయి. రాను రాను గడ్డుపరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని చిత్తూరు జిల్లా గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. స్మగ్లర్లు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వారు వాపోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న గ్రామీణులను వదిలేసి మిగిలినవారిని శాసించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారు. ఏమైనా ఎర్రచందనం స్మగ్లర్లను అదుపు చేయకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదన్నట్లుంది నేటి పరిస్థితి. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించకపొతే భవిష్యత్తులో స్మగ్లర్లు కొన్ని ప్రాంతాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకునే అవకాశాలూ ఉన్నాయి.