స్వయంకృషి ఖాతాదారులకు రూ.3.5కోట్ల శఠగోపం?
posted on Jun 22, 2012 @ 5:49PM
అనంతపురం జిల్లాలోని హిందూపురంలో స్వయంకృషి బ్యాంకు బోర్డు తిప్పేసింది. రోజువారీ అకౌంట్లు, డిపాజిట్లు వెరసి రూ.3.5కోట్లకు ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టేసింది. కంప్యూటీకరణ పేరుతో ముందస్తు ప్రణాళిక ప్రకారం బ్యాంకు మూసేసి సిబ్బంది ఉడాయించారు. ఈ మైక్రోఫైనాన్స్ సంస్థలో సుమారు 25వేల ఖాతాలున్నాయి. రెండేళ్ల కిందట మార్కెట్‌ఫీడర్‌రోడ్డులో దీన్ని అంగరంగవైభవంగా ప్రారంభించారు. ప్రతీ గ్రామంలోనూ స్వయంకృషిబ్యాంకు ఏజెంటున్నాడు. ఈ నియోజకవర్గంతో పాటు మడకశిర, పెనుకొండ, గోరంట్ల, కర్ణాటకరాష్ట్రంలోని గౌరీబిదనూరు, పావడ, మధుగిరి ప్రాంతాల నుంచి వందలాది మంది ఇందులో ఖాతాలు తెరిచారు. ముదిరెడ్డిపల్లి చేనేత కార్మికులే కోటి రూపాయలకుపైగా ఈ బ్యాంకులో దాచుకున్నారు. ఈ బ్యాంకు ఇచ్చిన పత్రాల్లో ఉన్న ఆధారాల ప్రకారం పరిశీలిస్తే రిజిష్టరు ఆఫీసు, హెడ్డాఫీసు, మొదటి అంతస్తు, డిఆర్‌వీప్లాజా, పాతబస్టాండుదగ్గర, బీబీరోడ్డు, దేవనహళ్లి, బెంగుళూరు రూరల్ జిల్లా`560110 చిరునామాను సంప్రదిస్తే అక్కడ అటువంటి బ్యాంకు లేదని తేలింది. అంతేకాకుండా ఫొనునెంబర్లు 080`27683775, 27682888 కూడా పని చేయటం లేదు. పదేళ్లలో ఇలానే పలు కంపెనీలు స్థానికులను మోసం చేశాయి. తమిళనాడుకు చెందిన వ్యాపారి ఎస్‌ఆర్ ఏజెన్సీ పేరుతో నెలరోజుల్లో రెట్టింపు ఇస్తామని ఇక్కడ అరకోటి వసూలు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.