టి బిల్లుకు మద్దతు..సీమాంధ్రకు ఇవి ఇవ్వండి: వెంకయ్య
posted on Feb 20, 2014 @ 7:21PM
రాజ్యసభలో సభ్యుల గందరగోళం మధ్యే తెలంగాణ బిల్లుపై వెంకయ్య నాయుడు ప్రసంగించారు. రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కాంగ్రెస్సే కారణమని మండిపడ్డారు. పదేళ్ళ క్రితం తెలంగాణపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మూడేళ్ళ కిందటే విభజన చేసి ఉంటే ఈ వివాదం ఉండేదికాదని వెంక్యనాయుడు అభిప్రాయపడ్డారు.
ఒకవైపు ప్రధాని విభజన చేయాలంటారు..మరోవైపు వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు కట్టుబడి వుందని, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలన్నదే తమ డిమాండని వెంకయ్య స్పష్టం చేశారు. సీమాంధ్రకు రూ. 15 వేల కోట్ల ద్రవ్యలోటు ఇవ్వలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ కంపెనీలను సీమాంధ్రలో కూడా పెట్టాలని ఆయన అన్నారు.
సీమాంధ్రను ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్రంగా ప్రకటించాలని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముగూడెం-సాగర్ టేల్‌పాండ్ పనులు ప్రభుత్వం చేపట్టాలని దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టుల పని వెంటనే ప్రారంభించాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు.