ఏక్ దిన్ కా సుల్తాన్ ఎవరో?
posted on Feb 25, 2014 @ 9:48AM
రాష్ట్ర విభజన వ్యవహారాన్ని చక్కబెట్టేసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా ముందు మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. 1. తెరాసను విలీనం చేసుకోవడం.2. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని నియమించడం.3. సీమాంధ్రలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవడం.
వీటిలో మొదటి అంశంపై ఇప్పటికే కాంగ్రెస్-తెరాస అగ్రనేతల మధ్య చర్చలు, గ్రూప్ ఫోటోలు దిగడంవంటివి పూర్తయిపోయాయి. ప్రస్థుత పరిస్థితుల్లో తెరాసను విలీనం చేయడం కంటే రెండు పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొంటేనే ఇరువురికీ లాభం ఉంటుందని కేసీఆర్ కాంగ్రెస్ యువరాజు గారికి బ్రెయిన్ వాష్ చేసే ఉంటారు. ఒకవేళ తెరాస విలీనానికి ఒప్పుకోకుండా పొత్తులకే పట్టుబట్టినా కాంగ్రెస్ పార్టీకి అంతకంటే వేరే గత్యంతరం లేదు గనుక, తప్పని సరిగా దానికే అంగీకరించవలసి ఉంటుంది. కనుక ఇక పొత్తుల ప్రకటన లాంచనమే అనుకోవచ్చును.
మొదట తెలంగాణాకు చెందిన వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినప్పటికీ, ఇప్పుడు తెరాస కొండంత అండగా నిలబడి ఉన్నందున అక్కడ పార్టీకి వచ్చేఇబ్బందేమీ లేదు గనుక, సీమాంధ్రలో బలహీనంగా ఉన్న పార్టీ పరిస్థితిని చక్క దిద్దుకోవడానికి అక్కడి నేతనే ముఖ్యమంత్రిగా నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిశ్చయించుకొన్నట్లు సమాచారం. ఏక్ దిన్ కా సుల్తాన్ (ఒక్క రోజు రాజుగారు) పదవిలాంటి మూడు నెలలు ముఖ్యమంత్రి పదవి కోసం కూడా చాలా మందే అర్రులు చాస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసు. ముఖ్య మంత్రి పదవి, పీసీసీ అధ్యక్ష పదవి కోసం చొంగలు కార్చుకొంటున్న తన వీరవిధేయ నేతలకి అవి పడేస్తే, వారే సీమాంధ్రలో పార్టీని బలపరిచే బాధ్యత కూడా తమ నెత్తి మీద వేసుకొంటామని హామీ ఇస్తున్నారు గనుక ఒకే దెబ్బకి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయని కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు వారందరినీ డిల్లీకి పిలిచి పదవుల పంపకాలు, వారి కుటుంబ సభ్యులకు టికెట్స్ కేటాయింపులు వగైరాలు చేసి రాష్ట్రానికి ఆఖరి కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు తెరాస, టీ-కాంగ్రెస్ నేతలందరూ కూడా సోనియాగాంధీ గీసిన గీత దాటబోరని రూడీ అయింది గనుక, సీమాంధ్రకు చెందిన వ్యక్తినే ఏక్ దిన్ కా సుల్తాన్ గా ప్రకటించేందుకు ఇబ్బందేమీ ఉండదు.అందువలన బహుశః ఈ రోజే కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటించవచ్చును.