ఒక్కటవుతున్న బొజ్జల, నాయుడు?
posted on Mar 3, 2014 7:09AM
ఒక్కటవుతున్న బొజ్జల, నాయుడు? ఒకనాటి గురుశిష్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎస్‌సీవీ నాయుడు ఒకే వేదికపై కనిపించారు. టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రథమ శిష్యుడి గా ఎస్‌సీవీనాయుడు పేరుపొందారు. కానీ ఎస్‌సీవీ నాయయుడు 2004లో వైఎస్ సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరి గురువు బొజ్జల పైనే పోటీచేసి గెలిచారు. మరోసారి 2009 ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో బొజ్జల, ఎస్‌సీవీ తలపడ్డారు. ఈ సారి విజయం బొజ్జల వైపు నిలచింది. అయితే కొంతకాలంగా ఎస్‌సీవీ నాయుడు టీడీపీలో చేరి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ నుంచి స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పించేందుకు మంత్రి గల్లా అరుణకుమారి బుధవారం శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (టీడీపీ), మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి (కాంగ్రెస్) ఒకే వేదికపై పలకరించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో ఉన్న పొగడచెట్టు కింద కూర్చుని కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో మంత్రితో స హా ఈ నేతలంతా చెట్టు కింద కూర్చుని 30 నిమిషాలు ముచ్చటలాడారు.