కావూరి కూడా జంప్ జిలానీయేనా?
posted on Mar 2, 2014 @ 2:21PM
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. ఈ విషయం వాళ్లూ వీళ్లూ కాదు.. స్వయంగా కావూరే చెప్పారు. 47 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, కేడర్, ప్రజలతో మాట్లాడి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 1984 నాటి కంటే అద్వాన్నంగా ఉందని అన్నారు. పార్టమెంట్‌లో టీబిల్లు అమోదించిన విధానం అవమానకరమని కూడా కావూరి విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బలిపెట్టి ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి రావడానికి విభజన చేయడం దురదృష్టకరమని అన్నారు. తనకు మంత్రి పదవి రానంత వరకు కాంగ్రెస్ పార్టీని, అధిష్ఠాన వర్గాన్ని తెగ తిట్టి పోసి, సమైక్య నినాదం భుజానికెత్తుకున్న కావూరి, ఆ తర్వతా ఒక్కసారిగా స్వరం మార్చి సోనియా, రాహుల్ గాంధీల భజన చేయడం తెలిసిందే. అలాంటిది మళ్లీ ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తే గెలవడం మాట అటుంచి డిపాజిట్లు కూడా రావని తెలిసిపోయినట్లుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఈ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన కూడా జంపు జిలానీల లిస్టులో ఉన్నట్లు అర్థమైపోతోంది.