నరసింహన్ గవర్నర్ గిరీ
posted on Mar 3, 2014 @ 6:58PM
పైకి చాలా సౌమ్యంగా కనిపించే గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టిన మొదటి రోజునే శాంతి భాద్రాల విషయంలో చాలా కటినంగా వ్యవహరిస్తానని ప్రకటించారు. ఆ తరువాత మాకీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే ముందు సంతకాలు చేసిన అనేక ఫైళ్ళను పునః సమీక్షించబోతున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. అదేవిధంగా నామినేటడ్ పదవులలో కిరణ్ కుమార్ రెడ్డి నియమించిన వారందరూ స్వచ్చందంగా తప్పుకోమని కోరారు. రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్టుకి చైర్మన్ గా కిరణ్ చేత నియమింపబడ్డ కేసీ రెడ్డి ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయగా మరోకొంతమంది త్వరలోనే తప్పుకోవచ్చును. ఆ తరువాత సమ్మె చేస్తున్న పెట్రోల్ బ్యాంకులపై ఆయన దృష్టి సారించారు. వారు వెంటనే సమ్మె విరమించకపోతే తీవ్ర చర్యలు తీసుకొంటానని గట్టిగా హెచ్చరించి వారిచే ఒకే ఒక్కరోజులో సమ్మె విరమింపజేసారు. ఈ రోజు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతీతో సమావేశమవాదం గమనిస్తే బహుశః ఆయన ఇక గాడి తప్పిన ప్రభుత్వనిర్వహణను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేయవచ్చును. నరసింహన్ అధికారం చెప్పటిన రెండు రోజుల్లోనే ఇంత చురుకుగా వ్యవహరిస్తూ పాలన చక్కబెట్టడం అభినందనీయం.