తెలంగాణాకు తెదేపా ప్రత్యేక కమిటీ
posted on Mar 3, 2014 @ 6:17PM
టీ కప్పులో తుఫానులా మొదలయిన తెదేపా-తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అలకపాన్పు సీను ప్రశాంతంగా ముగిసింది. తెదేపాను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలను ఖండిస్తూ తను తెదేపాలోనే ఉంటానని, తెలంగాణాలో పార్టీని బ్రతికించుకోవాలని తపన పడుతున్నానని ముక్తాయింపు ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. మరొకటి రెండు రోజుల్లో తెదేపా-తెలంగాణా కోసం ప్రత్యేకంగా ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవూరి, మండవ, మరియు యల్.రమణలతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీ తెలంగాణాలో పార్టీ శాఖకు కార్యవర్గం, ఎన్నికల కమిటీ, ఏర్పాటులో పార్టీ అధినేత చంద్రబాబుకి సహకరించవచ్చును. త్వరలో జరగనున్న ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగబోతున్నాయి గనుక, తాత్కాలికంగా ఈ ఐదుగురు సభ్యుల కమిటీ నేతృత్వంలోనే పోటీచేసి, రాష్ట్రం అధికారికంగా విభజింప బడిన తరువాత రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా శాఖలు ఏర్పాటు చేసేందుకు తెదేపా యోచిస్తున్నట్లు సమాచారం.