ఢిల్లీలో మరో "నిర్భయ" ఘటన

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై ఆత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతిని కిడ్నాప్ చేసి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక ఆత్యాచారానికి ఒడిగట్టారు. నిజాముద్దీన్ ప్రాంతంలో 23 ఏళ్ల యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం కదులుతున్న కారులో యువతిపై ఆత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి యువతిని ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలోని ఓ ఫ్లైఓవర్ వద్ద పడేసి వెళ్లిపోయారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై కిడ్నాప్, ఆత్యాచారం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ముద్రగడకు మద్దతుగా నిరసనలు

కాపు గర్జన సందర్భంగా తుని ఘటనలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన అమాయకులను విడుదల చేయాలంటూ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆమరణ నిరాహారా దీక్ష చేస్తున్న కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భార్య, కోడలి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు నిరసన ప్రదర్శనలకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో నిరనస ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలో సెక్ష్ 144, సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా గరిటెలతో కంచాలను మోగిస్తూ రహదారిపై ఆందోళనలకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ దామోదర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

సిద్దూ ఎం చేసినా వెరైటియే..కాకి వాలిందని..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏం చేసినా పబ్లిసిటీ అయిపోతోంది. అదేంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎం చేసినా అది సంచలనమే కదా. మొన్నామధ్య ఖరీదైన వాచీ పెట్టుకోని విమర్శలు మూటకట్టుకున్న సిద్ధూ..ఆ వెంటనే ఏసీబీ ఏర్పాటు, కుమారుడికి లబ్ధి చేకూర్చడం ఇలా ఒకటేంటి సీఎం సార్‌ ఫుల్లుగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. మళ్లీ రీసెంట్‌గా ఆయన కొత్త కారు కొన్నారు. అదేంటి కారు కొంటే అందులో వింతేముంది అనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం..   సిద్ధరామయ్య కారుపై జూన్ 2న ఓ కాకి వాలింది. డ్రైవర్ తరిమికొట్టినా వెళ్లకుండా..దాదాపు 10 నిమిషాల పాటు కారుపై ఉండిపోయింది. ఈ విషయం మీడియా ద్వారా రాష్ట్రం మొత్తం వ్యాపించింది. సాధారణంగా కాకిని చెడు శకునంగా భావిస్తుంటారు. దీంతో సీఎం నిన్న రూ.35 లక్షలు ఖర్చు పెట్టి టొయోటా ఫార్చ్యూనర్ కారు కొనుగోలు చేశారు. అయితే కాకి వాలడం వల్లే ముఖ్యమంత్రి గారు కొత్త కారు కొనేశారంటూ వార్తలు వస్తుండటంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

ఇద్దరు వ్యక్తులు..బ్యాంక్ ఖాతా ఒక్కటే

వారిద్దరి పేర్లు లక్ష్మీలే..వారి భర్తల పేర్లూ నాగరాజ్‌లే..ఆఖరికి ఊరు కూడా ఒక్కటే..ఇలాంటి పరిస్థితుల్లో వారి ముక్కు, మొహం తెలిస్తే ఓకే. లేదంటే ఎవరైనా బొక్కబోర్లాపడతారు. ఇప్పుడు ఇదే పొరపాటు జరగడానికి కారణమైంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా హోస్పేట్‌  తాలుకాలోని కమలాపుర బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకే ఖాతా సంఖ్యను ఇద్దరు మహిళలకు కేటాయించారు. వీరిలో ఒకరు కన్నడ మాట్లాడే లక్ష్మీ కాగా..ఒకరు తెలుగు మాట్లాడే లక్ష్మీ. ఇద్దరూ అదే ఊరిలో జన్ దన్ పథకం కింద బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దరఖాస్తు చేసుకున్నారు.   ఇద్దరి పేర్లూ..భర్తల పేర్లూ ఒకటే కావడంతో..బ్యాంక్ సిబ్బంది పొరపాటున ఇద్దరికీ ఒకే ఖాతా సంఖ్య మంజూరు చేశారు. వీరిలో కన్నడ లక్ష్మీ తన సంపాదనలో కొంత పొదుపు చేసి బ్యాంకులో జమ చేస్తోంది అలా రూ.8 వేలు  డిపాజిట్ చేసింది. అయితే ఈ విషయం తెలియని తెలుగు లక్ష్మీ జన్‌ధన్ కింద ప్రభుత్వం ఇస్తుందేమోనని భావించి తెలుగు లక్ష్మీ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన ఖాతాలో డబ్బు లేకపోవడాన్ని కన్నడలక్ష్మీ గమనించింది. దీనిపై బ్యాంక్ వారిని ఆరా తీయగా అప్పటికి గాని సదరు సిబ్బందికి చేసిన పొరపాటు తెలిసొచ్చింది. తెలుగు లక్ష్మీ అందుబాటులో లేరని, ఆమె వచ్చాక జరిగిన పొరపాటును సరిచేస్తామని మేనేజర్ హామి ఇచ్చారు.

పవన్ కల్యాణ్ ఓ జోకర్.. హీరోలా వచ్చి జీరోలా వెళుతున్నారు.. నారాయణ

  ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు అన్న సామెత ప్రకారం.. ముద్రగడ పద్మనాభం దీక్షపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఒక పక్క కాపుల కోసం ముద్రగడ దీక్ష చేస్తుంటే.. వారికి అండగా ఉంటానన్న ఆయన ఇప్పుడు ఎక్కడ పడుకున్నారని అన్నాడు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఓ జోకర్ అని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ అప్పుడప్పుడు హీరోలా వచ్చి జీరోలా వెళుతున్నారని.. జిమ్మిక్కులు చేస్తున్న పవన్ చెప్పే నీతులు వినడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరని నారాయణ అన్నారు.   పనిలో పనిగా టీఆర్ఎస్ పార్టీపై నారాయణ విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్పై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కోదండరాం మీద దాడిచేస్తే టీఆర్ఎస్ తన పతనానికి పునాది వేసుకోవడమే అని అన్నారు. విమర్శ ఎందుకు చేశారో తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవటమే వివేకమన్నారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కోదండరామ్ను ఉపయోగించుకుని, ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

ముద్రగడ వద్దకు పయనమైన నేతలు అరెస్ట్..

కాపు నేత ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ఆస్పత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను సందర్శించడానికి వెళ్లిన వైసీపీ నేతలను కూడా పోలీసులు అడ్డగించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడి ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోరుకొండ పోలీస్ స్టేషన్‌కి త‌ర‌లించారు. దీంతో ముద్ర‌గ‌డ‌ను క‌ల‌వ‌నివ్వ‌కుండా త‌మ‌ను పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

ఆటోగ్రాఫ్‌ ఇస్తుండగా సింగర్ దారుణహత్య..

  యూట్యూబ్‌ స్టార్‌, అమెరికన్‌ పాపులర్‌ సింగర్‌ క్రిస్టినా గ్రిమ్మీ దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 22ఏళ్ల క్రిస్టినా ఓర్లాండోలోని ది ప్లాజా లైవ్‌లో నిన్న జరిగిన ఓ టీవీ టాలెంట్‌ షోలో పాల్గొన్నారు. షో ముగిసిన అనంతరం ఆమె అభిమానులకు ఆటోగ్రాఫ్‌ ఇస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆమెను కాల్చి చంపాడు. తీవ్రంగా గాయపడిన క్రిస్టినాను ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఆమెను హత్య చేసిన వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు అమెరికా మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే అసలు హత్య ఎందుకు చేశాడన్న విషయం తెలియదని.. దర్యాప్తు చేయాల్సిన ఉందని పోలీసులు తెలిపారు.

ఒబామా, హిల్లరీపై చెలరేగిన ట్రంప్..

  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హిల్లరీ క్లింటన్ కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నడొనాల్డ్ ట్రంప్ స్పందించి ఇరువురిపై విమర్శలు గుప్పించారు. రిచ్‌మాండ్‌ వర్జీనియాలో జరిగిన ప్రచార సభలో ట్రంప్‌ మాట్లాడుతూ నేర విచారణ ఎదుర్కొంటున్న మహిళకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మద్దతిస్తున్నారంటూ విమర్శించాడు. ఈమెయిల్‌ సర్వర్‌ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న హిల్లరీ క్లింటన్‌కు ఒబామా మద్దతిస్తున్నారు.. దేశం కోరుకునే మార్గమిదేనా అంటూ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా సరే నవంబరులో జరిగే అద్యక్ష ఎన్నికల్లో హిల్లరీని ఎదుర్కోవడానికి తాను సిద్దంగా ఉన్నానని ట్రంప్‌ వెల్లడించారు.  

పిల్లలు చదవడంలేదని కర్పూరంతో కాల్చిన టీచర్..

పిల్లలు సరిగ్గా చదవడంలేదనో.. అల్లరి చేస్తున్నారనో చెప్పి టీచర్లు వారిని అప్పుడప్పుడు కఠినంగా శిక్షిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటి దారుణమైన ఘటనే జరిగింది. తమిళనాడు, విల్లుపురం జిల్లాలోని ఓ స్కూల్లో పిల్లలు బుద్దిగా చదువుకోవడం లేదని వైజ‌యంతి మాల అనే ఉపాధ్యాయురాలు ఏకంగా క‌ర్పూరం పెట్టి కాల్చింది. స‌రిగ్గా చ‌ద‌వాల‌ని హెచ్చ‌రిస్తున్నా విన‌డం లేదంటూ నాలుగో త‌ర‌గతి చ‌దువుతోన్న15మంది పిల్ల‌ల‌పై ఉపాధ్యాయురాలు ఈ చ‌ర్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో విద్యాశాఖ స్పందించి వైజ‌యంతి మాలను, ఆ పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడిని స‌స్పెండ్ చేసింది.   అంతేకాదు చిన్నారులను అంత దారుణంగా శిక్షించినందుకుగాను ఆమెపై జువెనైల్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమెకు ఈనెల 24వ తేదీ వ‌ర‌కు స్థానిక కోర్టు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది.

సత్తా చాటుతున్న కొత్త కుర్రాళ్లు.. ఐదో వికెట్ కోల్పోయిన జింబాబ్వే

  జింబాబ్వే రాజధాని హరారే లో భారత్-జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచి భారత్ ఫిల్డింగ్ ఎంచుకోగా.. జింబాబ్వే బ్యాటింగ్ కు దిగింది. అయితే టీమిండియాలో ఉందని కొత్త కుర్రాళ్లే అయినా తమ సత్తా చాటుతున్నట్టు తెలుస్తోంది. కెప్టెన్ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన కొత్త బౌలర్లు వరుసగా జింబాబ్వే వికెట్లు తీస్తున్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి 49 పరుగులిచ్చిన భారత బౌలర్లు మూడు వికెట్లు పడగొట్టారు 77 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. 23.6 ఓవర్‌ వద్ద అక్సర్‌ బౌలింగ్‌లో ఇర్విన్‌ 21(45) ఫెయిజ్‌ ఫజల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు.

ఇంటికెళ్లండి... మగతనానికి పూజలు చేయండి... ప్రవీణ్ తొగాడియా

  విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) కీలక నేత ప్రవీణ్ తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చ రచ్చ చేశారు. గుజరాత్ లోని భరూచ్ జిల్లా జంబూసార్ లో జరిగిన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. హిందూ పురుషుల్లో ‘ఇంపోటెన్సీ’ (లైంగిక సామర్ధ్యం) నానాటికి తగ్గిపోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా.. ‘ఇంటికెళ్లండి... మగతనానికి పూజలు చేయండి’’ అని హిందువులకు ఓ సలహా కూడా ఇచ్చారు. ముస్లింల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.. వారికి ధీటుగా హిందువులు కూడా పిల్లల్ని కనాలని.. లైంగిక పటుత్వాన్ని పెంచేందుకు తానో మందును తయారు చేశానని చెప్పిన ఆయన... రూ.600 విలువ కలిగిన సదరు మందును రూ.500లకే ఇవ్వనున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతుంది.

ప్రియాంక పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్దం..

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూతురు, ఇందిరా గాంధీ మనమరాలు ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెను ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కంటే.. ప్రియాంకా గాంధీని బరిలోకి దించితేనే గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సోనియా గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆమె యూపీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు  భుజాన వేసుకునేందుకు సిద్ధమయ్యారు. 2019లో రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీనే యూపీ ఎన్నికల బరిలో దిగనున్నట్టు ప్రచారం సాగుతోంది.   మరోవైపు ఈ ఎన్నికలపై బీజేపీ కూడా  సాధ్యమైనన్ని సీట్లు సాధించడమే కాకుండా ఆ రాష్ట్ర అధికార పగ్గాలను కూడా చేజిక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలపైనే దృష్టిసారించినట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్న కారణంగా మళ్లీ పుంజుకునేందుకు.. ఈ ఎన్నికలనే అస్త్రంగా భావిస్తుంది. మరి ప్రియాంక గాంధీ ఎంతవరకూ.. వారి ఆశలను నిజం చేస్తారో చూడాలి.

ముద్రగడ అరెస్ట్ పై చిరంజీవి ఆగ్రహం..

తుని ఘటనపై కాంగ్రెస్‌ నేత చిరంజీవి స్పందించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తుని ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని  డిమాండ్‌ చేశారు. కాపు, బలిజ, ఒంటరి కులాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ముద్ర‌గ‌డ అరెస్టు అమానుష‌మ‌ని, పోలీసులు ఆయ‌న ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరుపై చిరంజీవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముద్ర‌గ‌డను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్ర‌భుత్వం ముద్ర‌గ‌డ‌పై వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు క‌క్ష సాధింపు చ‌ర్య‌లా ఉంద‌ని ఆయ‌న అన్నారు.   కాగా ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరం ఆస్పత్రిలో తన ఆమరణ దీక్షను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకపక్క ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా వైద్య పరీక్షలు చేసుకునేందుకు మాత్రం ఆయన నిరాకరిస్తున్నారు. మరో వైపు ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా తూర్పుగోదావరి జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది.

ఖడ్సే కు క్లీన్ చిట్.. దావూద్ ఇబ్రహీం ఫోన్ కాల్స్ కాదట..

  అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో లింకులు ఉన్నాయంటూ మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఏక్ నాథ్ ఖడ్సేపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దావూద్ ఇబ్రహీంకు, ఖడ్సే కు మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని.. దావూద్ పలుమార్లు ఖడ్సేకు ఫోన్ చేశాడని కథనాలు వచ్చాయి. దీంతో ఆయన తన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఖడ్సేకు క్లీన్ చిట్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు పాక్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న ఫోన్ కాల్స్ దావూద్ ఇబ్రహీం ఇంటి నుంచి వచ్చినవి కావని..  దావూద్ ఇంటి నుంచి ఫోన్ కాల్స్ తనకు వచ్చాయని చెబుతున్న నెంబరును అసలు ఆయన ఏడాదిగా వాడటమే లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దావూద్ తో లింకుల విషయంలో ఖడ్సేకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ముంబై పోలీసులు సిద్ధమవుతున్నారు. మరి దీనిపై ఖడ్సే ఏవిధందా స్పందిస్తారో చూడాలి.

పుట్టినరోజు వేడుకల్లో లాలూ.. నితీశ్ కుమార్ శుభాకాంక్ష‌లు

  రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తన 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బీహార్‌ పాట్నాలోని త‌న నివాసంలో నేడు కుటుంబ సభ్యుల మ‌ధ్య ఆయ‌న ఈరోజు ఉద‌యం కేక్ క‌ట్ చేశారు. భార్య ర‌బ్రీదేవితో పాటు త‌న‌కూతురు ఈ సంద‌ర్భంగా ఇచ్చిన పుష్ప‌గుచ్చాని ఆయ‌న స్వీక‌రించారు. ఇంకా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా లాలూకి శుభాకాంక్షలు తెలిపారు. లాలూ నివాసానికి చేరుకుని ఆయ‌నకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. లాలూ ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకున్నారు. ఇంకా లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ పుట్టిన రోజు వేడుక సంద‌ర్భంగా ఆయ‌న ఇంటి వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

చోటా షకీల్ లిస్ట్ లో స్వామి చక్రపాణి కూడా..

  మాఫియా డాన్  చోటా రాజన్ ను మట్టుబెట్టే కేసులో దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్ ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇతనితో పాటు తాను రంగంలోకి దించిన నలుగురు కిల్లర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటపడింది. చోటా షకిల్ లిస్ట్ లో ఒక్క చోటా రాజన్ మాత్రమే లేడని.. హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చక్రపాణి.. దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలంలో ఆయన కారును కొనుగోలు చేసి దానిపై పెట్రోల్ పోసి తగలబెట్టినందుకు గాను చక్రపాణిని కూడా చంపేయాలని చోటా షకీల్ ఆ కిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాడట. మరి ఇంకా ఎంతమంది చోటా షకిల్ లిస్టులో ఉన్నారో..